మెదక్ నియోజకవర్గంలో టూరిజం అభివృద్ధికి ముందడుగు

  • మెదక్ చర్చికి రూ.29.18 కోట్లు మంజూరు
  • ఏడుపాయల, కొంటూర్ చెరువుకు నిధుల కోసం మంత్రులకు ప్రతిపాదనలు

మెదక్, వెలుగు: మెదక్ నియోజకవర్గంలో టూరిజం అభివృద్ధికి ముందడుగు పడింది. ఆయా దర్శనీయ స్థలాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేస్తున్న కృషి ఫలిస్తోంది. ఆయా చోట్ల టూరిస్టులను, భక్తులను ఆకట్టుకునేలా, మెరుగైన వసతి సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన నిధుల కోసం సంబంధిత మంత్రులకు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్​మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రపోజల్స్ పంపారు. ఈ క్రమంలో సీఎం స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ నుంచి వందేళ్లు పూర్తి కావస్తున్న మెదక్ చర్చి వద్ద వివిధ అభివృద్ధి పనుల కోసం పెద్ద మొత్తంలో నిధులు మంజూరుచేశారు. 

రూ.29.18 కోట్లు మంజూరు

మెదక్ చర్చి ప్రాంగణంలో వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.29.18 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. చర్చి ప్రాంగణంలో 100 మంది కెపాసిటీతో డార్మెటరీ నిర్మాణానికి రూ.18 కోట్లు, 100 మంది బస చేసేందుకు వీలుగా షెడ్ నిర్మాణానికి రూ.4.50 కోట్లు, ట్యాంకు నిర్మాణానికి రూ.1.5 కోట్లు,  జీసస్ విగ్రహం ఏర్పాటుకు రూ.45 లక్షలు, చర్చి మెయిన్ గేట్ నుంచి చర్చి ఎంట్రన్స్ వరకు సెంట్రల్ లైట్స్ కోసం రూ.18.50 లక్షలు,  చర్చి కాంపౌండ్ వద్ద ఇంటర్నల్ సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.2.55 కోట్లు, కాటేజీల నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయించారు. 

ఏడుపాయలకు రూ.143 కోట్లు!

పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయల భవానీ మాత ఆలయానికి వచ్చే భక్తులకు, టూరిస్టుల సంఖ్యకు అనుగుణంగా ఇన్​ఫ్రా స్ట్రక్చర్​డెవలప్​మెంట్, మంజీరా నదీ పాయల వద్ద ప్రమాదాల నివారణకు అవసరమై చర్యలు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పడం, తదితర అభివృద్ధి పనుల కోసం  రూ.143 కోట్లతో ఎండోమెంట్ మినిస్టర్, జిల్లా ఇన్​చార్జి మంత్రి కొండా సురేఖకు ప్రపోజల్స్ పంపించారు. 

పిక్నిక్ స్పాట్​గా కోంటూర్ చెరువు

మెదక్ మండల పరిధిలోని కొంటూర్ చెరువును పిక్నిక్ స్పాట్​గా, ఆ చెరువు ఒడ్డునే ఉన్న జామా మజీద్ బ్యూటిఫికేషన్, శమ్నాపూర్ గ్రామ శివారులో గుట్టపై ఉన్న పురాతన రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు, మౌలిక వసతుల కల్పన, లైటింగ్ ఏర్పాట్ల కోసం రూ.45 లక్షలతో టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావుకు ప్రపోజల్స్ పంపించారు.

టూరిస్ట్ ప్లేస్ లుగా తీర్చిదిద్దుతాం

నియోజకవర్గంలో పర్యాటక అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. ఏడుపాయల, పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ, మెదక్ చర్చి, కోంటూర్ చెరువు, జామా మజీద్, శమ్నాపూర్ రాజరాజేశ్వరి దేవాలయాన్ని  టూరిస్ట్ స్పాట్లుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రెడీ చేశాం. తదనుగుణంగా ఆయా పనులు అవసరమైన నిధుల కోసం సంబంధిత మంత్రులకు ప్రపోజల్స్ పంపించాం. మెదక్ చర్చికి ఎస్ డీఎఫ్ నుంచి రూ.29.18 కోట్లు మంజూరయ్యాయి. పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీని ఎకోటూరిజం స్పాట్ గా డెవలప్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.   - రోహిత్ రావు, ఎమ్మెల్యే, మెదక్