హైదరాబాద్ లోనే రోజుకు కోటిన్నర జనాభా

రాష్ట్ర జనాభా నాలుగున్నర కోట్లు ఉంటే.. రోజుకు హైదరాబాద్​లో దాదాపు కోటిన్నర ఫుట్​ ప్రింట్స్​ఉంటున్నట్టు తెలిసింది. ఉద్యోగాలు, ఉపాధి కోసం జిల్లాల నుంచి ఇక్కడికి లక్షల మంది వలస వచ్చి నివసిస్తున్నారు. అదే సమయంలో వివిధ పనుల కోసం, షాపింగ్, ఇతర విహార ఉల్లాసాలకూ హైదరాబాదే డెస్టినేషన్​గా మారింది. దీంతో నగరంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నది. ఫలితంగా నగరం దాటి బయటకు వెళ్లాలన్నా.. నగరంలోపల ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్లాలన్నా తీవ్ర ట్రాఫిక్​ సమస్య ఏర్పడుతున్నది.

దీంతోపాటు కాలుష్య సమస్యలు పెరుగుతున్నాయి. గత కొన్నేండ్లుగా రాజధాని కేంద్రంగానే ఐటీ, ఇండస్ట్రీస్, ఇతర ఆఫీస్ స్పేస్​ కార్యకలపాలు ఏర్పాటు కావడంతో ఈ సమస్య వచ్చినట్టు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే ఈ సమస్య తీవ్రత తగ్గుతుందని.. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్​ పెరగడంతోపాటు జీవన ప్రమాణాలు మెరుగవుతాయని భావిస్తున్నది. ఇతర దేశాల్లో ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు? వీటివల్ల కలిగిన లాభ నష్టాలు ఏంటి? అనేవాటిపై అధికారులు స్టడీ చేస్తున్నారు. 

క్యాపిటల్ సిటీలా ఇతర జిల్లాలను డెవలప్ చేసుకుంటే 99 శాతం మేలే చేస్తుందని సెక్రటేరియెట్​లో ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు వివరించారు. ఇప్పటికే ఫోర్త్​ సిటీ నిర్మాణం చేపడితే ఒకవైపే వెళ్తున్న డెవలప్ మెంట్​ కాస్త రూట్ మార్చుకుంటుందని పేర్కొన్నారు.  ఇక ప్రభుత్వం మూసీ పునరుజ్జీవం చేపడితే వికారాబాద్ తో పాటు ఇటు నల్గొండ, భువనగిరి, సూర్యాపేట జిల్లాల దాకా వివిధ రూపాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.