- శుభకార్యాల్లో పుస్తకాలను గిఫ్టుగా ఇవ్వాలి
- బుక్‌ఫెయిర్‌ను సందర్శించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ముషీరాబాద్, వెలుగు : మనిషి ఉన్నన్నాళ్లు పుస్తకం ఉంటుందని, పుస్తకం ద్వారానే జ్ఞానం పెరుగుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. ప్రతిఒక్కరూ పుస్తకాలను చదవడంతోపాటు చదివించాలని సూచించారు. ఎన్టీఆర్‌స్టేడియంలో కొనసాగుతున్న బుక్‌ఫెయిర్‌ను శనివారం ఆయన సందర్శించారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ, అక్షరయాన్, ట్రైబల్ వెల్ఫేర్, అక్షరాభ్యాస్, స్టేట్ సెంటర్ లైబ్రరీ స్టాళ్లను పరిశీలించారు. బుక్ ఫెయిర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘బుక్ డొనేషన్ బాక్స్’ను గవర్నర్ప్రారంభించారు. అనంతరం బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు, కవి యాకూబ్ అధ్యక్షతన జరిగిన సభలో గవర్నర్మాట్లాడారు.
ఈ– బుక్స్, ఆడియో బుక్స్కంటే ప్రింటెడ్బుక్స్చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. పుస్తకాన్ని చేతిలో పట్టుకుని చదువుతుంటే రచయితే నేరుగా విషయం చెబుతున్న అనుభూతి కలుగుతుందన్నారు. లైబ్రరీలు జ్ఞాన సంపదను కాపాడతాయని తెలిపారు. పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో బొకేలు, ఇతర గిఫ్టులకు బదులు పుస్తకాలు ఇవ్వాలని సూచించారు. పుస్తక పఠనంతో మెరుగైన సమాజం ఏర్పడుతుందన్నారు. డొనేషన్ బాక్స్ ఏర్పాటుపై గవర్నర్ప్రశంశలు కురిపించారు.
డొనేట్చేసిన పుస్తకాలను గ్రామీణ ప్రాంతాలకు పంపించాలనుకోవడం గొప్ప ఆలోచన అని మెచ్చుకున్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్, బుక్ ఫెయిర్ జాయింట్ సెక్రటరీ సురేష్, వైస్ ప్రెసిడెంట్ శోభన్ బాబు, జాయింట్ సెక్రటరీ సూరి బాబు, ట్రేసరరీ నారాయణ రెడ్డి, ఈసి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పలు పుస్తకాల ఆవిష్కరణ
అలాగే బుక్ ఫెయిర్ లో శనివారం డాక్టర్ పసునూరి రవీందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వాగ్గేయకారులు తమ పాటలతో ఆలోచింపజేశారు. మిట్టపల్లి సురేందర్, అంబటి వెంకన్న, నల్లిగంటి శరత్, ఏపూరి సోమన్న, జక్కగోపాల్ పాల్గొని తమ పాటలతో అలరించారు. ‘నచ్చిన.. మెచ్చిన.. ప్రభావతం చేసిన పుస్తకం’ కార్యక్రమంలో కంచె ఐలయ్య, సూరేపల్లి సుజాత, సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణ, వేద కుమార్ హాజరై మాట్లాడారు. కత్తి పద్మారావు రాసిన
‘మన దేశం మన రాజ్యాంగం’ పుస్తకాన్ని అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ గంటా చక్రపాణి, గ్రంథాలయ చైర్మన్ రియాజ్, బీఎస్ రాములు, సీనియర్ జర్నలిస్ట్బుచ్చన్న ఆవిష్కరించారు. ‘బంగ్లా హిందువుల అజ్ఞాత మారణకాండ’ పుస్తక ఆవిష్కరణలో వక్తలు అరవింద రావు, సురేందర్, రాజేశ్వరి, సంతోష్, పరిమళ, ఆయుష్ పాల్గొని మాట్లాడారు. 1971లో బంగ్లాలో హిందువులపై జరిగిన దారుణాలను ప్రస్తావిస్తూ రాసిన ఇంగ్లీష్పుస్తకాన్ని తెలుగులోకి అనువాదించడాన్ని మెచ్చుకున్నారు.
నేటితో ముగియనున్న బుక్ ఫెయిర్
బుక్ ఫెయిర్ ఆదివారం రాత్రి ముగుస్తుంది. ముగింపు కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. వీకెండ్‌కావడంతో శనివారం బుక్‌ఫెయిర్‌కు పుస్తక ప్రియులు భారీగా తరలివచ్చారు. ఆదివారం మరింత రష్ నెలకొనే అవకాశం ఉంది.