సూర్యాపేట జిల్లా అభివృద్ధిపై గవర్నర్ ప్రశంసల వర్షం

  • టెన్త్​ క్లాస్​లో 96.01 శాతం రావడం అభినందనీయం 
  • జిల్లా పర్యటనలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ 

సూర్యాపేట, వెలుగు: జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగుందని ,  2021లో 73 శాతం ఉన్న రక్తహీనత 2024 నాటికి 21 శాతానికి తగ్గించడం  అభినందనీయమని రాష్ట్ర - గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను పూర్తి వివరాలతో ఇస్తే... రాష్ట్రవ్యాప్తంగా, గ్రామీణ ప్రాంత ప్రజలలో రక్తహీనత నివారించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. గురువారం అయన సూర్యాపేట కలెక్టరేట్ లో అధికారులు, కళాకారులు, రచయితలు, ప్రముఖులతో ముఖాముఖిలో పాల్గొన్నారు.

జిల్లాకు వచ్చిన గవర్నర్ కు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, అధికారులు స్వాగతం పలికారు. ముందుగా గవర్నర్ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాల్స్ ను సందర్శించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.  జిల్లా ప్రాముఖ్యతను, సంస్కృతి, సంప్రదాయాలను, వివిధ శాఖల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ గవర్నర్ కు వివరించారు. 

అనంతరం గవర్నర్ మాట్లాడారు. స్వచ్ఛభారత్ లో జిల్లాలోని 475 గ్రామపంచాయతీలు బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా మార్చడం సంతోషమని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని గవర్నర్​ సూచించారు. సూర్యాపేట జిల్లాలోని ప్రజలను దారిద్ర్యరేఖ ఎగువకు తేవడం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రముఖులు, రచయితలు, కళాకారులు అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పారు. స్వయం శక్తితో ఉపాధి పొంది,  విజయాలు సాధించిన మహిళల గురించి  సమాజానికి తెలియజేయాలని అప్పుడే ఇతరులు వారిని స్ఫూర్తిగా పొంది అభివృద్ధి చెందుతారని అన్నారు. సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యం, విద్య రంగాలను పరిశీలిస్తే మెరుగైన స్థానంలో ఉన్నాయని, ప్రత్యేకించి   2024లో పదో తరగతిలో 96.91శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు. 

మహిళా సాధికారతకు కృషి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జిల్లాలో మహిళా సాధికారతకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పీపీటీ ద్వారా గవర్నర్​కు వివరించారు. విద్య, వైద్యం పై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఆస్పత్రుల్లో వైద్యులు నిరంతరం అందుబాటులో  ఉండేలా చర్యలను తీసుకున్నామని చెప్పారు. అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను సాధించిన పలువురు ప్రముఖులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు, డాక్టర్లు, అడ్వకేట్లు వారి కృషిని గవర్నర్ తో పంచుకున్నారు. 

జిల్లాను రోల్ మోడల్ గా చేస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

రాబోయే రోజుల్లో సూర్యాపేట జిల్లాను రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా చేయడం  తమ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. జిల్లాలో ఉన్న ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని  తెలిపారు. సూర్యాపేటకు సంస్కృతి, సంప్రదాయాల పరంగా, చరిత్రపరంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. అధికారులు సమిష్టిగా కృషి చేసి జిల్లాను అన్నీ రంగాలలో ముందుంచాలని కోరారు. 

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని, ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గన్ని బ్యాగ్స్, టార్ఫలిన్, తేమ కొలిచే యంత్రాలను అందుబాటులో ఉంచినట్లు మంత్రి తెలిపారు. కోదాడ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, జాయింట్ సెక్రటరీ భవాని శంకర్ ,జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, హుజూర్​ నగర్ మున్సిపల్ చైర్​ పర్సన్​  గెల్లి అర్చన ,సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ,తిరుమలగిరి మున్సిపల్ చైర్ పర్సన్ అనసూయ, జిల్లా అధికారులు, ఉన్నారు.