ధాన్యం కొనుగోలు పక్కాగా జరగాలి: మంత్రి దామోదర ఆదేశం

  • అధికారులకు మంత్రి దామోదర ఆదేశం

మెదక్, వెలుగు: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని,  ధాన్యం కొనుగోలు ప్రక్రియ పక్కాగా జరగాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్ మెడికల్​కాలేజీలో ఎంబీబీఎస్  క్లాస్​ల ప్రారంభోత్సవం అనంతరం వైద్యం, వ్యవసాయం, జిల్లా గ్రామీణ అభివృద్ధి, మార్కెటింగ్ సంబంధిత అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సమర్థవంతమైన పాలన లక్ష్యంగా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలన్నారు.

 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మే రైతులకు సకాలంలో డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎన్ని నిర్వహిస్తున్నారు,  కొనుగోలు ప్రక్రియ సక్రమంగా నడుస్తుందా, రవాణా విషయంలో తీసుకుంటున్న చర్యలు, క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా అనే విషయాలను పౌరసరఫరాల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో లోటుపాట్లను సరిదిద్దుకొని పని చేయాలన్నారు. 

రుణమాఫీ కి సంబంధించి ఎంతమంది రైతులు లబ్ధి పొందారు, ఇంకా ఎవరెవరికి రుణమాఫీ చేయాల్సి ఉంది, బ్యాంకులతో ఏమైనా సమస్య ఉన్నదా, అనే విషయాలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి గోవిందును ఆదేశించారు, మార్కెటింగ్ శాఖ ద్వారా పత్తి కొనుగోలు సక్రమంగా నడుస్తుందా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో జిల్లా జనాభా ఆధారంగా కొత్త ఆరోగ్య ఉప కేంద్రాలకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీరామ్ ను ఆదేశించారు. జిల్లా ఇన్​చార్జి మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, డీసీసీబీ చైర్మన్​దేవేందర్​రెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే మదన్​రెడ్డి పాల్గొన్నారు.

 వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట 

 సంగారెడ్డి (హత్నూర): వైద్య రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఇన్​చార్జి మంత్రి కొండా సురేఖ అన్నారు. హత్నూర మండలంలోని దౌల్తాబాద్ లో కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం కలెక్టర్ క్రాంతి, ఎమ్మెల్యే సునీతా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రూ.కోటి 56 లక్షలతో నిర్మించిన పీహెచ్​సీ ప్రారంభంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. 30 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పీహెచ్​సీ నిర్మాణానికి స్థలం ఇచ్చిన వ్యక్తికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆస్పత్రి ఎదుట కలెక్టర్, ఎమ్మెల్యే చెట్లను నాటారు. ఆర్డీవో రాజు, తహసీల్దార్ పర్హిన్ షేక్, డీఎంహెచ్​వో గాయత్రీ దేవి పాల్గొన్నారు.

నిధుల మంజూరు కోసం మంత్రులకు వినతి

కొల్చారం: మండల అభివృద్ధి పనులకు నిధులు మంజూరుచేయాలని మండల పార్టీ అధ్యక్షుడు  మల్లేశం గౌడ్ మంత్రులు దామోదర, సురేఖలకు వినతి పత్రం అందించారు.  సానుకూలంగా స్పందించిన వారు రాంపూర్​లో బస్తీ దవాఖాన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా రాంపూర్​ మాజీ సర్పంచ్​సామల యాదగిరి బస్తీ దవాఖాన నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 

మంత్రి వెళ్లగానే కాంగ్రెస్​ నాయకులపై దూషిస్తూ దాడికి ప్రయత్నించిన సామల యాదగిరి అతడి భార్య మమతపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం బస్తీ దవాఖాన నిర్మాణ పనులు జరుగుతాయని పేర్కొన్నారు. మండలంలో అసంపూర్తిగా ఉన్న తహసీల్దార్​ బిల్డింగ్​కు రూ.60లక్షలు, పీహెచ్​సీ అదనపు బిల్డింగ్​కు రూ.30లక్షలు, బీసీ కమ్యునిటీహాల్​కు రూ.కోటి.50లక్షలు, మురికి కాలువల నిర్మాణానికి రూ.కోటి50లక్షలు అడిగామని దీనికి మంత్రులిద్దరూ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సమావేశంలో మాజీ సర్పంచ్, కౌడిపల్లి బ్లాక్​ కాంగ్రెస్​నాయకుడు శ్రీనివాస్​రెడ్డి, మండల గౌడ సంఘం నాయకుడు వెంకట్​గౌడ్, మధుసూదన్​రెడ్డి, కాంగ్రెస్​నాయకులు పాల్గొన్నారు.