ప్రభుత్వ డైట్ కాలేజీకి మంచిరోజులు! అభివృద్ధి పనులకు రూ.8.62 కోట్లు మంజూరు

  • ఇవాళ శంకుస్థాపన చేయనున్న మంత్రి తుమ్మల  
  • గతేడాది డైట్ కాలేజీకి సెంటర్​ఆఫ్​ఎక్స్ లెన్స్ హోదా

ఖమ్మం, వెలుగు:  ఖమ్మంలోని డిస్ట్రిక్ట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్​ ట్రైనింగ్(డైట్​) కాలేజీలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.8.62 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులకు శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేయనున్నారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రెండు కాలేజీలకు సెంటర్ ఆఫ్ ఎక్స్​ లెన్స్​ హోదా కల్పించగా, అందులో ఖమ్మం డైట్ కాలేజీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మంలోని డైట్ కాలేజీలో అదనపు సౌకర్యాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు మంత్రి తుమ్మల చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయించారు.

 అదనపు తరగతి గదులు, లైబ్రరీ రూమ్, కంప్యూటర్​ రూమ్, సెమినార్​ హాల్, రెండు ల్యాబ్​లు, స్పెషల్ ఎడ్యుకేషన్ యూనిట్, రీసెర్చ్ అండ్ ఎన్వివేషన్స్​ సెంటర్, ప్రహరీ నిర్మాణాలు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న డైట్​ కళాశాల భవనాలకు రిపేర్లు చేపట్టనున్నారు. అదే విధంగా అదనపు టాయిలెట్ల నిర్మాణం, ఉన్న వాటికి రిపేర్లు చేయనున్నారు. మంచినీటి సౌకర్యం, పార్కింగ్, క్యాంటీన్​ తదితర సౌకర్యాలు కల్పించనున్నారు.

విద్యా శిక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు.. 

జిల్లా స్థాయిలో విద్యా శిక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించటం కోసం ఖమ్మంలో  డైట్ కాలేజీని 1990లో ప్రారంభించారు. అప్పుడు టీటీసీ కోర్సు ఒక సంవత్సరంగా ఉండగా, 150 సీట్లు ఉండేవి. 1991లో టేకులపల్లిలో కొత్త భవనాలు నిర్మించారు. 2000 సంవత్సరంలో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఈడీ) కోర్సు మొదలైంది. దీనిలో ఫస్టియర్​ లో 100 సీట్లు, సెకండియర్​ లో 100 సీట్లున్నాయి. తర్వాత జరిగిన మార్పుల్లో 2014–-15 విద్యా సంవత్సరంలో డీఎడ్​కోర్సు, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్​ కోర్స్​ (డీఈఎల్ఎడ్) గా మారింది. 

Also Read :- జగిత్యాలలో పెరిగిన సైబర్ మోసాలు

ప్రస్తుతం డైట్​లో డీఈడీ కోర్సు మాత్రమే నిర్వహిస్తుండగా, సెంటర్ ఆఫ్ ఎక్స్​లెన్స్​హోదా రావడంతో డిప్లోమా ఇన్​ప్రీస్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్ఈ) కోర్సు కూడా రానున్నది. దీని ఆధారంగా అంగన్​వాడీ పిల్లలకు, ఎల్​కేజీ పిల్లలకు బోధించేందుకు అవసరమైన టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డైట్కాలేజీకి నిధులు మంజూరయ్యేలా కృషి చేశారు. తాజాగా రూ. 8.62కోట్లు మంజూరు కాగా, వివిధ రకాల పనులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆయా పనులకు ఇవాళ మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.