వైటీడీ బోర్డు ఏర్పాటుకు ముందడుగు!

  • ప్రత్యేక చట్టం కోసం న్యాయశాఖకు ప్రతిపాదనలు
  • 20 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటు!
  • సీఎం ఆమోదం తర్వాత కేబినెట్ ముందుకు ఫైల్

హైదరాబాద్, వెలుగు: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో యాదగిరిగుట్ట ప్రత్యేక పాలక మండలి బోర్డు (వైటీడీ) ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈమేరకు వైటీడీ ప్రత్యేక చట్టం కోసం న్యాయశాఖకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. 

బోర్డుకు సంబంధించిన విధి విధానాల రూపకల్పనలో దేవాదాయశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. బోర్డులో చైర్మన్​తో పాటు 20 మంది సభ్యులు ఉండేలా కసరత్తు జరుగుతున్నది. వైటీడీ బోర్డులో కమిటీ సభ్యులతో పాటు ఎండోమెంట్ కమిషనర్, ఆలయ ఈవో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. బోర్డు ఏర్పాటుకు సంబంధించిన అంశంపై గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి వైటీడీ బిల్లు!

వైటీడీ ప్రత్యేక చట్టం కోసం ఎండోమెంట్ అధికారులు న్యాయశాఖ కార్యదర్శికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. న్యాయశాఖ ఆమోదిస్తే ఫైల్ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ వద్దకు.. అక్కడి నుంచి దేవాదాయ శాఖ మంత్రి వద్దకు వెళ్తుంది. ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి రెండు, మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నది. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక ఫైల్ సీఎం వద్దకు వెళ్తుంది. ఆయన ఆమోదం తర్వాత కేబినెట్​లో చర్చిస్తారు. ఈ నెలాఖరులో కేబినెట్ భేటీ జరగనున్నది. కేబినెట్ ఆమోదం తర్వాత.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వైటీడీ బిల్లు ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది.