ధరణిలో సీక్రెట్ యాక్సెస్!

  • ఐటీ నిపుణుల ​ప్రాథమిక అంచనా
  • సీఎం ఆదేశాల మేరకు ఫోరెన్సిక్ ఆడిట్​కు కసరత్తు
  • పోర్టల్ బ్యాక్ ఎండ్​లో ఏం జరిగిందో తేల్చే పనిలో ఆఫీసర్లు
  • సర్వర్ లాగ్​లు, యూజర్,సీక్రెట్​ యాక్సెస్​లు, టీజీటీఎస్ పాత్రపై స్టడీ 
  • తప్పుడు రిపోర్టులు, ప్రొసీడింగ్స్​తో మారిన ల్యాండ్స్​ను గుర్తించేలా యాక్షన్ ప్లాన్

హైదరాబాద్, వెలుగు:  గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ మాటున జరిగిన భూముల దోపిడీకి సంబంధించిన లోగుట్టును తేల్చేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అయింది. రూ. లక్షన్నర కోట్ల విలువైన  ప్రభుత్వ, వివాదస్పద భూములను తిరిగి వెనక్కి తీసుకువచ్చేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఇన్నాళ్లు ప్రైవేట్ ఏజెన్సీ టెర్రాసిస్ ఆధ్వర్యంలో కొనసాగిన ధరణి పోర్టల్ నిర్వహణను ఎన్ఐసీకి ప్రభుత్వం ఇటీవలే అప్పగించింది. ఇప్పుడు ధరణిలో జరిగిన అక్రమ భూ బదలాయింపులపై ఫోకస్ పెట్టింది. 

పోర్టల్​లో భూముల తారుమారుపై త్వరలోనే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించనుంది. ఐటీ నిపుణులతో పాటు రెవెన్యూ ఆఫీసర్లు ఇందులో పాల్గొననున్నారు. పాత రెవెన్యూ రికార్డుల ఆధారంగా 2014 కంటే ముందు ఉన్న ప్రభుత్వ (అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, అటవీ, తదితర) భూములతో పాటు వివాదస్పద భూములను పోల్చి చూడనున్నారు. ఆ రికార్డులు, ఎప్పుడు ఎలా మారాయో శాస్త్రీయంగా ఆధారాలు సేకరించేందుకు సర్కారు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రధానంగా ఎకరా కోట్లలో పలుకుతున్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్​గిరి, సంగారెడ్డి  జిల్లాల్లోనే ఈ తరహా అక్రమ భూ బదలాయింపులు ఎక్కువగా జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. ఇప్పటికే వచ్చిన ఫిర్యాదులు, ఉన్నతాధికారుల నివేదికల ప్రకారం హైదరాబాద్ చుట్టుపక్కల మూడు జిల్లాల పరిధిలో 2 వేల ఎకరాలపైనే ప్రభుత్వ భూములు.. ప్రైవేటు పట్టాలుగా మారిపోయాయి. 

ధరణి పోర్టల్​ను ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే ఇంకా వేల ఎకరాలు బయటపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే సర్వర్ లాగ్​లు, యూజర్ యాక్సెస్​లతో జరిగిన వ్యవహారాలతో పాటు అసలు ఎవరి ప్రమేయం లేకుండా ధరణి బ్యాక్ ఎండ్​లోనే మారిపోయిన భూములను గుర్తిస్తున్నారు. ముఖ్యంగా ధరణి పోర్టల్​లోకి ఎవరికైనా సీక్రెట్​యాక్సెస్​ఉందేమోననే అనుమానాలు  బలపడ్తున్నాయి. ఈ మేరకు ఐటీ నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 

తప్పుడు రిపోర్టులతో మార్చేశారా? 

ఆర్ఓఆర్–2020 యాక్ట్ ప్రకారం ధరణిలో ఉన్న భూముల డేటాలో మార్పులకు ఎడిట్ ఆప్షన్ అధికారం కేవలం కలెక్టర్, సీసీఎల్ఏకు మాత్రమే ఇచ్చారు. ధరణిలో పెట్టుకున్న భూ అప్లికేషన్లకు తహసీల్దార్లు, ఆర్డీఓలు రిపోర్టులు మాత్రమే పంపే అవకాశం ఉంది. అయితే, ఎలాంటి రిపోర్ట్ లేకున్నా.. భూ విస్తీర్ణంలో హెచ్చు, తగ్గులు, పీవోబీ లిస్ట్ నుంచి భూములను తీయడం, ల్యాండ్ క్లాసిఫికేషన్, పేర్లు మార్చడం లాంటివి కూడా నేరుగా కలెక్టర్, సీసీఎల్ఏ లాగిన్స్​లో చేసే అవకాశం గత ప్రభుత్వంలో ఉంది. 

దీంతో అన్ని రకాల ప్రభుత్వ భూములు, వివాదాస్పద ల్యాండ్స్ ఎక్కడెక్కడున్నాయో గ్రామం, మండలం, జిల్లాల వారీగా గుర్తించి ఎవరి యూజర్​ ఐడీలో భూములు తారుమారు అయ్యాయో ఇప్పుడు తేల్చనున్నారు. ఎక్కడైనా భూములు అక్రమంగా బదలాయింపు జరిగినట్లు తేలితే.. ఆ సమయంలో అక్కడ తహసీల్దార్, జిల్లా కలెక్టర్ ఎవరు ఉన్నారన్నది చూస్తారు. ఒకవేళ సీసీఏల్ఏ వరకు వస్తే అప్పుడు సీసీఎల్ఏలో ఎవరున్నారో గుర్తించి, ఎవరి ఆదేశాలతో చేశారో విచారించాలని భావిస్తున్నారు. ఇటీవల 52 ఎకరాల భూదాన్​భూములను ఇలాగే తప్పుడు రిపోర్ట్ లు, ప్రోసిడింగ్స్​తో ప్రైవేట్ పట్టాగా మార్చేశారని చెప్తున్నారు. 

అసలు బాగోతమంతా బ్యాక్ ఎండ్​లోనే?  

ధరణి కంటే ముందు 2017లో అప్పటి భూ రికార్డుల ప్రక్షాళన చేసి.. ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్ మెంట్ సిస్టం (ఐఎల్ఆర్ఎంఎస్)ను అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది. అప్పుడు రికార్డుల నిర్వహణ వ్యవహారమంతా ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోనే ఉంది. ఆ తర్వాత ఇందులోని వివరాలను 2020లో ధరణి పోర్టల్​లోకి ప్రభుత్వం మార్చింది. కానీ ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఉండే టీజీటీఎస్ (తెలంగాణ టెక్నాలజికల్ సర్వీసెస్​) సంస్థ నామినేషన్ పద్ధతిలో ఐఎల్ఎఫ్ఎస్ కు ధరణి పోర్టల్ నిర్వహణను అప్పగించింది. తర్వాత ఐఎల్ఎఫ్ఎస్​ను టెర్రాసిస్ అనే సంస్థ ద్వారా సత్యం రామలింగరాజుకు సంబంధించిన వ్యక్తులు కొనుగోలు చేశారు. దీంతో ప్రభుత్వం 2014 నుంచి 17 వరకు, 2017 నుంచి 2020 వరకు 2020 నుంచి 2023 డిసెంబర్ వరకు ప్రతి మూడేండ్లకు ఒకసారి రికార్డులు ఎలా మారాయో ఫోరెన్సిక్ ఆడిట్​చేసి గుర్తించాలని భావిస్తోంది. ఇందుకు సబ్ రిజిస్ర్టార్ ఆఫీస్​లో ఉన్న డేటాను కూడా తీసుకుని సరిపోల్చనుంది. 

ప్రధానంగా 2020లో ధరణి వచ్చినప్పటి నుంచి గతేడాది డిసెంబర్ వరకు పోర్టల్ బ్యాక్ ఎండ్​లో ఏం జరిగిందో తేల్చనుంది. ప్రస్తుతం ఎన్ఐసీ చేతిలోనే సాఫ్ట్ వేర్ నిర్వహణ నడుస్తున్నది. దీంతో ముందుగా అసలు ఎవరి ప్రమేయం లేకుండా ధరణిని నిర్వహించిన ప్రైవేట్ ఏజెన్సీ నుంచే బ్యాక్ ఎండ్​లో నేరుగా సాఫ్ట్​వేర్​లో ఉన్న భూముల డేటాలోనే మార్పులు చేసే అవకాశం ఉందా అన్నది గుర్తించనున్నారు.

అలాంటి అవకాశం ఉందని తేలితే.. ఎక్కడెక్కడ మార్పులు జరిగాయన్నది తేల్చనున్నారు. టీజీటీఎస్​కు లాగిన్ ఐడీ ఉందా? నామినేషన్ పద్ధతిలో ధరణి పోర్టల్ ను అప్పగించాలని అప్పటి ఐటీ శాఖ మంత్రి నుంచి ఒత్తిడి వచ్చిందా? ఆయన ద్వారా భూ బదలాయింపులు జరిగాయా? అన్న వివరాలూ ఫోరెన్సిక్ ఆడిట్ లో తెలియనుంది. ఒకవేళ విదేశాల నుంచి భూములను మార్చినా.. ఐపీ అడ్రస్ ల ఆధారంగా గుర్తించనున్నారు. 

అసలు భూములు.. ధరణి భూములకు తేడా 

ధరణిలో ట్రాన్సాక్షన్ల హిస్టరీ ఏమీ లేకుండా చేయడం, రికార్డులను డిజిటల్ గా నిర్వహించడం వల్ల చాలా జాగ్రత్తగా ఫోరెన్సిక్ ఆడిట్ చేయాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు అంటున్నారు. రాష్ట్రంలో 2017లో జరిగిన ల్యాండ్ రికార్డుల అప్​డేషన్​లో ఐఎల్ఆర్ఎంఎస్ వెబ్ ల్యాండ్​లోకి 60.24 లక్షల ఖాతాలకు సంబంధించిన 1.48 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు ఎంట్రీ అయ్యాయి. వీటిలో అటవీ శాఖతో కలిపి అన్ని రకాల ప్రభుత్వ భూములు 77.38 లక్షల ఎకరాలు ఉన్నాయి. ధరణి పోర్టల్ ప్రకారం అగ్రికల్చర్ అసైన్డ్ ల్యాండ్ కోటి 53 లక్షల ఎకరాలు ఉన్నది. నోషనల్ ఖాతాలో అంటే ఇరిగేషన్, ఫారెస్ట్, శిఖం, ఇతరత్రా ప్రభుత్వ భూములు కలిపి 75.96 లక్షల ఎకరాలు ఉన్నది. అయితే, ధరణిపై ప్రభుత్వం వేసిన కమిటీ అసలు ప్రభుత్వ భూములకు, ధరణిలో ఉన్న ఎకరాల విస్తీర్ణానికి సరిపోలడంలేదని ఇదివరకే రిపోర్ట్ ఇచ్చింది.  

మార్చేసి.. అమ్ముకున్నారు

ధరణి పోర్టల్ మాటున ప్రభుత్వ, అసైన్డ్, అటవీ, వక్ఫ్, వివాదాలు ఉన్న విలువైన భూములను కొల్లగొట్టిన అక్రమార్కులు.. వాటిని ఇతరుల పేర్ల మీదకు బదలాయించినట్లు తెలుస్తోంది. లక్షన్నర కోట్ల విలువైన భూములు అటు ఇటు అయ్యాయని.. కాళేశ్వరం కంటే పెద్ద అవినీతి ఇది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల అసెంబ్లీ సెషన్స్​సందర్భంగా మీడియా చిట్​చాట్​లో చెప్పారు. ఇక ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన అక్రమార్కులు సేల్ చేసి కొన్ని పేర్లు మార్చగా.. ఎవరికీ అనుమానం రావొద్దనే వేరే వాళ్ల పేర్లకు చేంజ్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

సిద్ధిపేట జిల్లాలో ఇలాంటి వ్యవహారంపైనే ప్రభుత్వానికి కంప్లయింట్ రాగా విచారణ చేస్తున్నారు. దాదాపు 400 ఎకరాల ప్రభుత్వ భూమి వివిధ కంపెనీల పేరు మీదకు మార్చినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వాస్తవానికి అధికారంలోకి రాకముందే ధరణి పోర్టల్​లో అక్రమాలపై ఫోరెన్సిక్​ ఆడిట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పుడు తమ ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో ఫోరెన్సిక్ ఆడిట్ చేయనున్నట్టు ప్రకటించారు.