- నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి అవకాశం
- ఫలించిన మంత్రి పొన్నం ప్రయత్నాలు
- హుస్నాబాద్‌లో రైతుల సంబురాలు
సిద్దిపేట, వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తికి మరో ముందడుగు పడింది. 90 శాతం పూర్తయినా ప్రారంభానికి నోచుకోని ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.437 కోట్లను కేటాయించింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై నియోజకవర్గ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. హుస్నాబాద్‌లో రైతులు, కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగించడానికి శ్రమిస్తున్నారు.
ప్రాజెక్టు పూర్తయితే లక్షా 6 వేల (1,06,000 )ఎకరాలకు సాగునీరు అందనుంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో 57,852 ఎకరాలు, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో 48,148 ఎకరాల ఆయకట్టు ఉంది. గత ప్రభుత్వం పర్యావరణ అనుమతులు పొందకుండా పనులు చేపట్టడంతో కొందరు నిర్వాసితులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)ను ఆశ్రయించారు. ఎన్జీటీ ఆదేశాలతో ఏడాది కాలంగా పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్ లో సీడీ అండ్ సీఎం పనులు పెండింగ్ ఉన్నా ప్రస్తుతం కేటాయించిన నిధులతో పనుల్లో వేగం పుంజుకునే అవకాశాలున్నాయి.
పుష్కర కాలంగా సాగుతున్న పనులు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని అక్కన్నపేట మండలంలో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పుష్కర కాలంగా సాగుతున్నాయి. 2009లో 1.45 టీఎంసీల సామర్థ్యంతో గౌరవెల్లి ప్రాజెక్టును నిర్మించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం 1,800 ఎకరాలను సేకరించి పనులనూ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలోనే రిజర్వాయర్ పనులు మొదలయ్యాయి. 2007లో ప్రాజెక్ట్ ను ఎస్ఆర్ఎస్పీ రెండో దశలో వరద కాలువ ప్రాజెక్టు కింద పనులు చేపట్టడానికి రూ.913.15 కోట్లతో పనులు చేపట్టడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులిచ్చింది.
తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 2015లో కేసీఆర్ ప్రాజెక్టును రీడిజైన్ చేసి గౌరవెల్లి ప్రాజక్టు సామర్థ్యాన్ని 8.23 టీఎంసీలకు పెంచాడు. ఇందుకోసం 3,870 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ప్రాజెక్టుతో ముంపునకు గురైన గ్రామాల నిర్వాసితులు ఐదేండ్లుగా ఆందోళనలు చేస్తున్నారు.
ఎన్జీటీ క్లియరెన్స్ కీలకం
గౌరవెల్లి ప్రాజక్టుకు ఇప్పుడు ఎన్జీటీ క్లియరెన్స్ కీలకంగా మారుతున్నది. గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా ప్రాజక్టు ప్రారంభించాలని భావించినా ఎన్జీటీ షాకిచ్చింది. ఎన్జీటీ నాలుగు ఆర్డర్లు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ఏకంగా జీఆర్ఎంబీ (గోదావరి రీవర్ మేనేజ్మెంట్ బోర్డు) ఆధ్వర్యలో గౌరవెల్లి ప్రాజక్టు కట్ట వద్ద 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్యాచ్ వర్క్ పనులు జరగకుండా చర్యలు చేపట్టింది. దీంతో గతేడాదిగా పనులు పూర్తిగా నిలిచిపోయాయి.
నిధుల మంజూరుతో నిర్వాసితులకు ఊరట
భూసేకరణకు సంబందించి నిర్వాసితులకు దాదాపు పరిహారాలు లభించినా.. ముంపు గ్రామాల్లోని ఇండ్ల స్ట్రక్చర్, ఖాళీ స్థలాలు, 18 ఏండ్లు నిండిన వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ముంపు గ్రామాల్లోని యువతులకు ఇవ్వాల్సిన పరిహారాలు పెండింగ్ ఉన్నాయి. రెండేండ్లుగా నిర్వాసిత గ్రామాలకు చెందిన యువతులు పరిహారాల కోసం ఆందోళన చేస్తూనే ఉన్నారు. ప్రాజక్టుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయడంతో నిర్వాసితుల పరిహారాలు చెల్లించడంతో పాటు ప్రధాన కాల్వల నిర్మాణానికి అవకాశం ఏర్పడింది.
ఫలించిన పొన్నం ప్రయత్నాలు
గౌరవెల్లి ప్రాజక్టు పురోగతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయత్నాలు ఫలించాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచే దీనిపై ఫోకస్ పెట్టారు. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్ట్‌ల లిస్ట్‌లో గౌరవెల్లిని చేర్చారు. కాల్వల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వరుస రివ్యూలతో స్పీడప్ చేశారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌తో ప్రాజెక్టుపై చర్చించి నిధులు కేటాయించడంలో కీలక పాత్ర వహించారు. మిగిలిన 10% పనులు పూర్తి కాకపోతే.. 90% పనులు పూర్తయిన డ్యామ్‌కు వర్షాకాలంలో నష్టం జరుగుతుందని.. పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు ఎన్జీటీని పర్మిషన్ కోరాలని అధికారులకు సూచించారు. అనుమతులు వస్తే ప్రాజెక్టు ప్రారంభానికి మార్గం సుగమం అవుతుంది.