బ్యాంక్​ గ్యారంటీ ఇస్తేనే మిల్లర్లకు ధాన్యం : డైరెక్టర్ ప్రసాద్​

వనపర్తి, వెలుగు: మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇస్తే నే  ధాన్యం ఇస్తామని స్టేట్​ సివిల్ సప్లయ్ డైరెక్టర్​ వీఎన్​వీఎస్​ ప్రసాద్​ తెలిపారు. ఇది నాలుగు భాగాలుగా విభజించామని, గత సీజన్ లో ధాన్యం బాగా ఇచ్చినవారి నుంచి 10 శాతం, మిగిలిన వారికి 20 నుంచి 25 శాతం బ్యాంక్ గ్యారంటీ కోరుతున్నామన్నారు. బుధవారం వనపర్తి కలెక్టరేట్​లో కలెక్టర్ ఆదర్శ్ సురభి, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి జిల్లాలోని రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఆయన మదనాపూర్, కొత్తకోట మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

 అనంతరం ఆయన మాట్లాడుతూ, పక్క రాష్ట్రాల్లో వంద శాతం బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటున్నారని, తెలంగాణలో కొంతవరకు మాత్రమే అడుగుతున్నామన్నారు. వనపర్తి జిల్లాలో 171 రైస్ మిల్లులు ఉండగా, ఇప్పటి వరకు 47 మిల్లులు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చాయన్నారు. మిల్లర్లు ఎఫ్​సీఐకి ఇవ్వాల్సిన ధాన్యం ఇవ్వకుండా భారీగా డిఫాల్టర్లు అయ్యారన్నారు. తెలంగాణ సోనా బియ్యానికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ పెరగడంతో ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చిందన్నారు. సమావేశంలో సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్,  రైస్ మిల్లర్లు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.