గడువులోగా ఇంటింటి సర్వే పూర్తి చేయాలి : సుదర్శన్ రెడ్డి

గద్వాల, వెలుగు: ఓటర్ జాబితా సవరణలో ఇంటింటి సర్వే ఎంతో కీలకమని, గడువులోగా సర్వేను కంప్లీట్ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం జోగులాంబ గద్వాల కలెక్టరేట్‌లో కలెక్టర్ సంతోష్‌తో కలిసి రెవెన్యూ ఆఫీసర్లతో ఓటర్ జాబితా సవరణపై రివ్యూ నిర్వహించారు. అనంతరం గద్వాల టౌన్ లోని వంటలపేట, గర్ల్స్ హైస్కూల్లో జరుగుతున్న బూత్ లెవెల్ ఆఫీసర్ల ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పులు లేకుండా పక్కాగా ఓటర్ జాబితా తయారు చేయాలన్నారు. 

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్ తన పరిధిలోని బూత్ లెవెల్ ఆఫీసర్ల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు ఫోటో మార్పు, అడ్రస్ సవరణ తదితర వాటిని పకడ్బందీగా రూపొందించాలన్నారు. ఫారం 6 నుంచి 8 వరకు ఎలాంటి తప్పులు లేకుండా నింపాలన్నారు. పొలిటికల్ పార్టీల లీడర్ల సమక్షంలో డ్రాఫ్ట్‌ను విడుదల చేయాలన్నారు. అనంతరం ఈవీఎం గోదామును పరిశీలించి అక్కడి సీసీ కెమెరాల పనితీరు భద్రతపై ఆరా తీశారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు నరసింగరావు, శ్రీనివాసరావు, ఆర్డీవో రామచందర్ తదితరులు పాల్గొన్నారు.