- క్యూ2లో రూ.3,012 కోట్లుగా నమోదు
- మెరుగుపడిన అసెట్ క్వాలిటీ
- తగ్గిన మొండిబాకీలు
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్‌లో అద్భుత ప్రగతి సాధించింది. స్టాండ్ ఎలోన్ ప్రాతిపదికన లాభం మూడింతలు పెరిగింది. గత సెప్టెంబరు క్వార్టర్‌లో రూ.944 కోట్ల లాభం రాగా, ఈసారి ఇది 218 శాతం పెరిగి రూ.3,011.73 కోట్లుగా రికార్డయింది. ఈ క్యూ2లో ఎస్‌బీఐకి రూ.2,345 కోట్ల లాభం రావొచ్చని ఎనలిస్టులు వేసిన అంచనాలకు మించి ఫలితాలు రావడం విశేషం. ఫలితాల విషయం తెలిసిన వెంటనే ఎస్‌బీఐ షేరు కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఫలితంగా ఇది ఏడుశాతం పుంజుకొని రూ.295కు చేరుకుంది. ఇదిలా ఉంటే, తన సబ్సిడరీ ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో కొన్ని ఇన్వెస్ట్మెంట్లను అమ్మడంతో రూ.3,484 కోట్లు (ఎక్సెప్షనల్ ఐటెం) సమకూరాయి. సీక్వెన్షియల్‌గా స్లిపేజ్‌లు రూ.16 వేల కోట్ల నుంచి రూ.ఎనిమిది వేల కోట్లకు తగ్గాయి. అసెట్ క్వాలిటీ మెరుగుపడింది. స్థూల ఎన్‌పీఏలు గత సెప్టెంబరు క్వార్టర్‌తో పోలిస్తే ఈసారి 276 బేస్ పాయింట్లు తగ్గి 7.19 శాతం నమోదయ్యాయి. క్వార్టర్‌వారీగా చూస్తే 35 బేసిస్ పాయింట్లు తగ్గాయి. నికర ఎన్‌పీఏ రేషియో వార్షికంగా 205 బేస్ పాయింట్లు, సీక్వెన్షియల్‌గా 28 బేస్ పాయింట్లు తగ్గి 2.79 శాతం రికార్డయింది. నికర వడ్డీ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే ఈసారి 17.67 శాతం పెరిగి రూ.24,600 కోట్లుగా నమోదయింది.
పెరిగిన నిర్వహణ లాభం
బ్యాంకు నిర్వహణ లాభం 31 శాతం పెరిగింది. గత సెప్టెంబరు క్వార్టర్‌లో ఇది రూ.13,905 కోట్లు కాగా, తాజా క్వార్టర్‌లో రూ.18,199 కోట్లకు చేరింది. రిటైల్ పర్సనల్ అడ్వాన్సులు బాగా పెరగడంతో డొమెస్టిక్ క్రెడిట్ గ్రోత్ 8.43 శాతంగా నమోదయింది. వార్షికంగా చూస్తే ఇవి 18.90 శాతం పెరిగాయి. గత నెల 30 నాటికి బ్యాంకు మొత్తం ఔట్‌స్టాండింగ్ లోన్లలో ప్రొవిజన్లు రూ.22,399 కోట్లు (89.63 శాతం) ఉన్నాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో (పీసీఆర్) గత సెప్టెంబరు క్వార్టర్‌లో 70.74 శాతం ఉండగా, తాజా క్వార్టర్‌లో 81.23 శాతానికి చేరింది. సీక్వెన్షియల్‌గా పీసీఆర్ 189 బేస్ పాయింట్లు పెరిగింది. పన్నుల వ్యయాలు భారీగా పెరిగి రూ.2,048 కోట్లకు చేరాయి. వడ్డీయేతర ఆదాయాలు వార్షికంగా 9.3 శాతం పెరిగి రూ.8,538 కోట్లకు చేరుకున్నాయి. ప్రి–ప్రొవిజన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 19.2 శాతం ఎగిసి రూ.14,714 కోట్లు (వార్షికంగా) అయింది. మూలధన నిధులకు కొరత లేదని బ్యాంకు తెలిపింది. తాజాగా టైర్ 1 ఫండింగ్ కింద ఈ క్వార్టర్‌లో రూ.3,104.80 కోట్లు సేకరించామని పేర్కొంది.

