పదే పదే ఓడిపోతున్నాం.. మెంటల్ కండిషన్ బాగోలేదు.. బోర్డు అధికారులకు మహిళా క్రికెటర్‌ లేఖ

మహిళా క్రికెట్‌లో ఆధిపత్యం గురించి చెప్పాలంటే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లదే. ఏళ్లకు ఏళ్ళు గడుస్తున్నా.. ఈ ఇరు జట్లదే పైచేయి. భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు అడపాదడపా విజయాలు సాధించినా.. ఐసీసీ టోర్నీల విషయానికొస్తే.. అయితే ఆస్ట్రేలియా లేదంటే ఇంగ్లండ్ జట్టుది ట్రోఫీ. ఇప్పటికీ అదే తంతు. 

ఇక బంగ్లాదేశ్, పాకిస్తాన్, జింబాబ్వే జట్ల విషయానికొస్తే.. ఓటమి కోసం ఆడే జట్లుగా ముద్ర పడిపోయాయి. ఒకవేళ ఈ మూడు జట్ల మధ్య ట్రై సిరీస్ నిర్వహిస్తే.. ఎవరు గెలుస్తారో.. కూడా చెప్పడం కష్టం. అదీ వీరి ఆట తీరు. ఇలాంటి ప్రదర్శనల పట్ల విసుగుపోయిన ఓ బంగ్లా మహిళా క్రికెటర్ జహనారా ఆలం(Jahanara Alam).. ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారులకు వింత లేఖ రాసింది. 

ఎంత పోరాడినా విజయాలు దక్కడం లేదని.. పదే పదే ఓడిపోతున్న సందర్భాలు తన మనసును కుంగదీశాయని జహనారా లేఖలో పేర్కొంది. వీటి నుంచి తేరుకొని తాను మామూలు మనిషి అవ్వడానికి ఓ రెండు నెలల విరామం ఇవ్వాలని లేఖలో ప్రస్తావించింది. అవసరమైతే సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తనను మినహాయించాలని కోరింది.

Also Read : జనవరి 7 నుంచి మలేసియా ఓపెన్ సూపర్‌‌‌‌ 1000 టోర్నమెంట్‌ స్టార్ట్

స్వాగతించిన బీసీబీ అధికారులు

జహనారా ఆలం నిర్ణయాన్ని బీసీబీ అధికారులు స్వాగతించినట్లు తెలిపారు. ఆమె తేరుకున్నాక తమకు తెలియజేస్తుందని.. అప్పుడు జట్టులో చోటు కల్పిస్తామని వివరించారు.   

 "మేము ఆమె(జహనారా ఆలం) నిర్ణయాన్ని గౌరవించాలి, ఎందుకంటే ఆమె మానసికంగా సిద్ధంగా లేదు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలనేది ఆమె నిర్ణయం. మేము దానిని అంగీకరించాలి. ఆమె ఈ కుంగుబాటు నుంచి ఎప్పుడు బయట పడుతుందనేదానికి నిర్దిష్ట సమయ వ్యవధి లేదు. ఆమెకు మంచిగా అనిపించినప్పుడు మాకు తెలియజేస్తుంది.." అని బీసీబీ మహిళా విభాగం ఇన్‌చార్జి హబీబుల్ బషర్ వివరణ ఇచ్చారు.

జహనారా అలం బంగ్లాదేశ్ తరుపున 52 వన్డేలు, 83 టీ20ల్లో 108 వికెట్లు పడగొట్టింది. ఇందులో ఐదు వికెట్లు తీసిన సందర్భాలు నాలుగు ఉన్నాయి.