డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. స్పృహ తప్పిన బాలిక 

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. పవన్ కృష్ణా జిల్లాలో గొడవర్రులో పర్యటిస్తున్న క్రమంలో తొక్కిసలాట జరిగి ఓ బాలిక స్పృహ తప్పి పడిపోయింది. సోమవారం ( డిసెంబర్ 23, 2024 ) పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ సమయంలో అక్కడే ఉన్న ఒక బాలిక స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు భారీగా జనం తరలి రావడంతో ఘటనాస్థలిలో భారీగా రద్దీ ఏర్పడింది.. ఆ రద్దీలో  బాలికకు ఊపిరాడక  స్పృహ తప్పి పడిపోయింది.ఇది గమనించిన బాలిక తండ్రి హుటాహుటిన బాలికను బైకుపైనే సమీపంలోని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. రద్దీ విపరీతంగా ఉండటంతో బాలికను బయటకు తీసుకురావడంలో ఇబ్బందులు ఏర్పడినట్లు తెలుస్తోంది.

కాగా. కంకిపాడు మండలం గుడవర్రు గ్రామానికి వెళ్లిన పవన్ కళ్యాణ్.. అక్కడ జరుగుతున్న రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించారు. ఆర్ అండ్ బి శాఖ ఇంజనీర్లతో కలిసి రోడ్డు నాణ్యత, పనితీరును పరిశీలించేందుకు రోడ్డుపైనే చిన్న గొయ్యిని తవ్వి పరిశీలించారు పవన్ కళ్యాణ్.