యాక్టింగ్ చింపేశాడు : రామాయణం నాటకంలో రాక్షసుడు.. వేదికపైనే పందిని చంపి తినేశాడు

నాటకం పేరుతో స్టేజిపైనే పందిని చంపి మాంసం తిన్న ఘటనలో స్టేజి ఆర్టిస్టుని అరెస్ట్ చేసిన విషయం ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో వెలుగు చూసింది.

పూర్తివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని రాలాబ్ గ్రామంలో కంజియానల్ యాత్ర సందర్భంగా గ్రామస్తులు రామాయణం నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకాన్ని బింబధర్ గౌడ్‌ అనే స్టేజ్ ఆర్టిస్ట్ ఆర్గనైజ్ చేశాడు. ఈ నాటకంలో బింబధర్ గౌడ్‌ రాక్షసుడి పాత్ర పోషించాడు. ఇందులోభాగంగా నాటకం జరుగుతున్న సమయంలో  ఓ సన్నివేశంలోభాగంగా స్టేజీపైనే పందిని  కత్తితో దారుణంగా పొడిచి మాంసం తిన్నాడు. అంతేగాకుండా ఈ నాటకంలో కొన్ని పాములను కూడా ఉపయగించి హింసించినట్లు కొందరు ఆడియన్స్ గమనించారు. 

దీంతో దగ్గరలోని పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బింబధర్ గౌడ్‌ ని అరెస్ట్ చేశారు. జంతువుల పట్ల క్రూరత్వం మరియు వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగడంతో సోమవారం అసెంబ్లీలో అధికార బీజేపీ సభ్యులు బాబు సింగ్, సనాతన్ బిజులీ అసెంబ్లీలో ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించారు. అంతేగాకుండా ఈ సంఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జంతు హక్కుల కార్యకర్తలు స్పందిస్తూ నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఈ విషయం గురించి పోలీసులు స్పందిస్తూ ఈ నాటకంలో పాల్గొన్న మరింతమంది కోసం వెతుకుతున్నామని తెలిపారు. త్వరలోనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హింజిలి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనిబాస్ సేథీ తెలిపారు.