తిరుమలలో పీఠాధిపతులనే అవమానిస్తారా : అదనపు ఈవోపై శ్రీ శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం

టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిపై శ్రీ శ్రీనివాసానంద సరస్వతి ఫైర్ అయ్యారు. శనివారం ( అక్టోబర్ 26, 2024 ) తిరుపతిలోని అర్బన్ హార్ట్ లో జరిగిన జాతీయ సాధు సమ్మేళనం సదస్సుకు హాజరైన 300 మంది స్వామీజీలు, తదితరులకు .. టీటీడీ ఈవో, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు దర్శనం కనిపిస్తానని మాట ఇచ్చి...  దర్శనానికి వెళ్లినప్పుడు ఇచ్చిన మాట తప్పి స్వామీజీలను ఘోరంగా అవమానించారని మండిపడ్డారు శ్రీనివాసానంద.

సోమవారం ( అక్టోబర్ 28, 2024 ) మీడియాతో మాట్లాడుతూ..  గత వైసిపి ప్రభుత్వం లోనే స్వామీజీలకు గౌరవం ఇచ్చి వీఐపీలకు మించి స్వామి వారి దర్శనం చేయించే వారని కొనియాడారు. కూటమి పాలన లో హిందూ సనాతన ధర్మాన్ని ఆచరిస్తామని మాట ఇచ్చి..  అది నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యిందని అన్నారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి లాంటి అవగాహన లేనివారి వల్ల ధర్మం గాడి తప్పుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో  బయట రాష్ట్రాల నుండి మంచి ఐఏఎస్ అధికారిని టీటీడీ ఏఈఓ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు స్వామిజీ. స్వామివారి దర్శనం కోసం దూర ప్రాంతాల నుండి వచ్చేవారికి అదనపు ఈవో వెంకయ్య చౌదరి నిరాశ మిగుల్చుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి ప్రమాదకర  వాతావరణాన్ని సహించేది లేదని హెచ్చరించారు స్వామిజీ శ్రీనివాసానంద సరస్వతి.