చిత్తూరు జిల్లా: శ్రీకాళహస్తి మండలం వేడంలోని కాలభైరవ ఆలయంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. మంగళవారం అర్ధరాత్రి క్షుద్రపూజలు చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా తమిళనాడు చెందినవారుగా గుర్తించారు. శ్రీకాళహస్తి దేవస్థాన ఏఈవో ధనపాల్ ప్రోత్సాహంతోనే తాము పూజలు చేశామని ఆ ఐదుగురు వ్యక్తులు వెల్లడించారు. దీంతో ఏఈవో ధనపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆలయ సెక్యూరిటీ గార్డుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కాలభైరవ ఆలయంలో తాంత్రిక పూజల ఘటనపై ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. శ్రీకాళహస్తి దేవాలయ అధికారుల నుంచి మంత్రి వివరాలు కోరారు. క్షుద్రపూజల వ్యవహారంలో శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఈ పూజల్లో ఆలయ ఏఈవో ధన్‌పాల్ ప్రమేయంపై 24 గంటల్లో పూర్తి నివేదికను అందించాలన్నారు.

