- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- రైతుల ఆదాయం పెరిగేలా ఆహారశుద్ధి పరిశ్రమలను స్థాపించాలి
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- బుగ్గపాడు ఫుడ్ పార్కు ప్రారంభం
సత్తుపల్లి, వెలుగు : పారిశ్రామికంగా బుగ్గపాడు ఫుడ్ పార్క్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా ఫుడ్ పార్క్ ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి ఆయన మాట్లాడారు. రాజకీయంగా, విద్యా పరంగా ఖమ్మం జిల్లా ముందు ఉందన్నారు. ఐటీ రంగం, ఉపాధి కల్పనకు, స్థానిక నిరుద్యోగ యువతకు బంగారు భవిష్యత్ కల్పించేందుకు ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
గతంలో తమ ప్రభుత్వ హయాంలో మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దామని, నేడు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలను కోటీశ్వరులను చేసే కార్యక్రమానికి నాంది పలికామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులను వాడుకుంటూ శాస్త్రీయంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా లాభాలలో వాటా కల్పించింది ప్రజా ప్రభుత్వమేనని, ఇక్కడ పవర్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం : మంత్రి తుమ్మల
ఫుడ్ పార్క్ లో ఎక్కువ పరిశ్రమలు తీసుకుని వచ్చి ఈ ప్రాంత రైతులు పండించే జామ, కొబ్బరి కాయ, ఆయిల్ పామ్, తదితర పంటలన్నింటికీ గిట్టుబాటు ధర కల్పిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ లో మొత్తం 200 ఎకరాలకు పైగా అందుబాటులో ఉందని తెలిపారు.
ఆహార శుద్ధి పరిశ్రమల ద్వారా రైతుల ఆదాయం పెరగాలని, అటువంటి పరిశ్రమలు టీజీఐఐసీ అధికారులు తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ సత్తుపల్లిలో సింగరేణికి సంబంధించిన నాణ్యమైన బొగ్గు అందుబాటులో ఉందని ఇక్కడ పవర్ ప్లాంట్ తోపాటు బొగ్గు ఆధారిత చిన్న, సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. బేతుపల్లి కాల్వ, లంక సాగర్ ప్రాజెక్టు రిపేర్ త్వరగా పూర్తి చేయాలని
విజ్ఞప్తి చేశారు.
ఆయిల్ పామ్ విస్తరణకు చర్యలు : కలెక్టర్
ఫుడ్ పార్క్ పరిధిలో లక్ష ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉందని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే 9 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోందని తెలిపారు. ఈ ఏడాది ఆరు వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రెండు వేల ఎకరాల్లో పండ్లు, కూరగాయల సాగు పెరిగేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.
అంతకుముందు తెలంగాణ నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్, తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రులు, ఎమ్మెల్యే పరిశీలించి ఎల్లో అండ్ గ్రీన్ టెక్నాలజీస్ సంస్థను ప్రారంభించారు. కొత్తగా పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన ఏడు సంస్థల ప్రతినిధులకు అంగీకార పత్రాలను అందజేశారు. కాగా ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో సత్తుపల్లి నుంచి బుగ్గపాడు వరకు భారీ మోటర్ సైకిల్, కార్ల ర్యాలీ నిర్వహించారు.
ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఖమ్మం సీపీ సునీల్ దత్, టీజీఐఐసీ చైర్మన్ టి. నిర్మల జగ్గారెడ్డి, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, ఈడీ పవన్ కుమార్, పలు శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.