SL vs NZ 2024: రచిన్ రవీంద్ర అసమాన పోరాటం వృధా.. తొలి టెస్టులో శ్రీలంక విజయం

గాలే వేదికగా న్యూజిలాండ్ పై జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక 63 పరుగులతో విజయం సాధించింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 211 పరుగులకు ఆలౌటైంది. 4 వికెట్ల నష్టానికి 207 పరుగులతో చివరి రోజు ఆటను ప్రారంభించిన సౌథీ సేన మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించింది. నాలుగో రోజు 91 పరుగులు చేసి కివీస్ ఆశలు సజీవంగా ఉంచిన రచిన్ రవీంద్ర ఐదో రోజు ఒక పరుగు మాత్రమే జోడించి ప్రభాత్ జయసూర్య బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

విలియం ఒరోర్కే పరుగులేమి చేయకుండా చివరి వికెట్ గా వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లు స్పిన్నర్ జయసూర్య పడగొట్టాడు. ఈ విజయంతో శ్రీలంక రెండు టెస్టుల మ్యాచ్ సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండు ఇన్నింగ్స్ ల్లో 9 వికెట్లు పడగొట్టిన ప్రభాత్ జయసూర్యకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రెండో టెస్ట్ గాలే వేదికగా సెప్టెంబర్ 26 న జరుగుతుంది. ఈ మ్యాచ్ లో న్యూజి లాండ్ ఓడిపోతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. 

Also Read :- రోహిత్ బెయిల్-స్విచ్ ట్రిక్‌

ఈ టెస్ట్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 305 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 340 పరుగులు చేసి 35 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 309 పరుగులకు ఆలౌటైంది. 275 పరుగుల లక్ష్యంతో దిగిన న్యూజిలాండ్ 211 పరుగులకు ఆలౌటైంది.