కొలంబో : శ్రీలంక అధ్యక్షడు గొటబాయ రాజపక్సకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దేశం విడిచి పారిపోదామనుకున్న రాజపక్సకు ఎయిర్పోర్టులో చుక్కెదురైంది. దుబాయ్ వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్న గొటబాయను అధికారులు వెనక్కి పంపారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు సైతం క్లియరెన్స్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో ఆయన సముద్రమార్గం ద్వారా దేశం విడిచి పోయే ప్రయత్నాల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బుధవారం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని రాజపక్స ప్రకటించినా.. ఆందోళనకారులు మాత్రం ఆయన విదేశాలకు పారిపోకుండా అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆందోళనకారులు అడ్డుకోవడం, ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతించకపోవడంతో దుబాయ్ కు వెళ్లే నాలుగు ఫ్లైట్లు మిస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో భార్యతో కలిసి మిలటరీ స్థావరానికి చేరుకున్న గొటబాయ రాత్రి అక్కడే బస చేసినట్లు తెలుస్తోంది.
ప్రెసిడెంట్ హోదాలో ఉన్నందున రాజపక్సను అరెస్ట్ చేసే అవకాశం లేదు. అందుకే పదవికి రాజీనామా చేసేలోపు దేశం విడిచిపోయేందుకు ఆయన అన్ని దారులు వెతుకుతున్నారు. ఇందులో భాగంగానే సముద్రమార్గంలో దుబాయ్కు వెళ్లాలని గొటబాయ భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్న రాజపక్స తమ్ముడు బసిల్ రాజపక్స సైతం మంగళవారం దేశం విడిచివెళ్లేందుకు ప్రయత్నించినా ఎయిర్పోర్ట్ సిబ్బంది పర్మిషన్ ఇవ్వలేదు. బసిల్ కు శ్రీలంకతో పాటు అమెరికా పౌరసత్వం ఉంది. బిజినెస్ ట్రావెలర్ పెయిడ్ సర్వీసు ఉపయోగించుకుని దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించగా ఆ సర్వీసుల్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రకటించారు. దాదాపు 3 గంటల పాటు ఎయిర్ పోర్టులోనే ఎదురుచూసినా ఫలితం లేకపోవడం, కొందరు ప్యాసింజర్లు బాసిల్ను అడ్డుకోవడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
