SA vs SL: గంటలోపే ముగిసింది: సౌతాఫ్రికా పేసర్ల విశ్వరూపం.. 42 పరుగులకే శ్రీలంక ఆలౌట్

రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా సౌతాఫ్రికా శ్రీలంక మధ్య తొలి టెస్టు రెండో ఆటలో సంచలనం చోటు చేసుకుంది. డర్బన్‌లోని వేదికగా కింగ్స్‌మీడ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో శ్రీలంక 13.5 ఓవర్లలో కేవలం 42 పరుగులకే ఆలౌట్ అయింది. సఫారీ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చేరగడంతో లంక ఆటగాళ్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా లంక బ్యాటింగ్ కొనసాగింది. జట్టులో కామిందు మెండీస్ (13), లాహిరు కుమార (10) మినహాయిస్తే మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. 

సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాసించాడు. కగిసో రబడా రెండు వికెట్లు.. కొయెట్జ్ కి ఒక వికెట్ దక్కింది. పాతుమ్ నిస్సాంక(3), దిముత్ కరుణరత్నే(2),ఏంజెలో మాథ్యూస్ (1),ధనంజయ డి సిల్వా(7), సింగిల్ డిజిట్ కి పరిమితం కాగా.. దినేష్ చండిమాల్,కుసాల్ మెండిస్,ప్రబాత్ జయసూర్య,విశ్వ ఫెర్నాండో,అసిత ఫెర్నాండో డకౌటయ్యారు. ఏకంగా ఐదుగురు లంక ఆటగాళ్లకు డకౌట్ కావడం విశేషం. గంటకే ఇన్నింగ్స్ ముగియడం షాకింగ్ కు గురి చేస్తుంది.   

శ్రీలంక 42 పరుగులకే ఆలౌట్ కావడంతో కావడంతో తొలి ఇన్నింగ్స్ లో  సౌతాఫ్రికాకు 149 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ప్రస్తుతం సౌతాఫ్రికా 177 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా కేవలం 191 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లు అద్భుతంగా రాణించడంతో సౌతాఫ్రికా ఆటగాళ్లు పరుగులు చేయడానికి తంటాలు పడ్డారు. కెప్టెన్ టెంబా బవుమా ఒక్కడే 70 పరుగులు చేసి రాణించాడు.