- కొండా లక్ష్మణ్ హార్టికల్చరల్యూనివర్సిటీ ప్రత్యేక దృష్టి
- అధిక దిగుబడినిచ్చే వంగడాల రూపకల్పన
- కూరగాయల కొరత తీర్చే దిశగా అడుగులు
సిద్దిపేట/ములుగు, వెలుగు: మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా కూరగాయల ఉత్పత్తిని పెంచే దిశగా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖతో కలిసి కాయగూరల పంటలను విస్తృతంగా సాగు చేసే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా కూరగాయల సప్లయ్ లేకపోవడం వల్ల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కాయగూరల కొరతను నివారించడంతో పాటు అధిక దిగుబడినిచ్చే విత్తనాల తయారీపై హార్టికల్చరల్ వర్సిటీ అధికారులు ఫోకస్చేశారు. ఎక్కువగా ప్రజలకు అవసరయ్యే కూరగాయలను గుర్తించి వాటి సాగును పెంచే దిశగా కసరత్తు చేస్తున్నారు.
విస్తృతంగా అవగాహన సదస్సులు
కూరగాయల సాగు పెంచడం కోసం గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ భూసారాన్ని బట్టి పంటలను సూచిస్తున్నారు. దీని వల్ల కాయగూరల ఉత్పత్తి పెరగడంతో పాటు రైతుకు అధిక లాభాలు వస్తాయని చెబుతున్నారు. పండించిన పంటకు మార్కెట్లో గిట్టు బాటు ధర లభించే విధంగా కృషి చేయడంతో పాటు ప్రత్యేక కూరగాయల సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు.
Also Read :- నియోజకవర్గాల పునర్విభజనతో సౌత్ స్టేట్స్కు నష్టం
నాణ్యమైన విత్తనాల సరఫరా చేసి, తెగుళ్లు రాకుండా ముందస్తు సూచనలు చేస్తున్నారు. రవాణా, మార్కెట్వంటి అంశాల్లో సహకారం అందిచడానికి సిద్ధమవుతున్నారు. ప్రకృతి విపత్తులను ఎలా అధిగమించాలి అనే దానిపై రైతులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు.
కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు
పండించిన కూరగాయలను దీర్ఘకాలం నిల్వ ఉంచి, మార్కెట్లో అమ్ముకునేందుకు ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలనే దిశగా హార్టికల్చరల్ వర్సిటీ అధికారులు అడుగులు వేస్తున్నారు. కోల్డ్స్టోరేజీల వల్ల కొంత మేర కాయగూరల కొరతను తీర్చడమే కాకుండా అవసరమైన ప్రాంతాలకు వీటిని రవాణా చేసే వీలుంటుందని భావిస్తున్నారు.
మరోవైపు అధిక దిగుబడునిచ్చే వంగడాల రూపకల్పనకు వర్సిటీ సైంటిస్టులు పరిశోధనలు ముమ్మరం చేశారు. డ్రాఫ్టింగ్ పద్దతిలో కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని మెజార్టీ గ్రామాల్లో కూరగాయలు సాగు చేయడంతో పాటు అమ్ముకోవడానికి మార్కెట్లను అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా..
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కూరగాయల సాగు పెంచే దిశగా హార్టికల్చరల్ యూనివర్సిటీ తరపున ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఏడాదంతా కూరగాయల సాగు ఎలా చేయాలి, పట్టణాల చుట్టూ ఉన్న గ్రామాల్లో ఎలాంటి కాయగూరలు పండించాలనేదానిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. హైబ్రిడ్ వంగడాల రూపకల్పనకు పరిశోధనలు చేస్తున్నాం. డ్రాఫ్టింగ్ పద్ధతిలో కూరగాయల సాగుపై శిక్షణ ఇస్తాం.
ఈ విధానం సక్సెస్ అయితే కాయగూరల సాగు గణనీయంగా పెరుగుతుంది. కూరగాయల ఉత్పత్తుల నిల్వ కోసం కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు వర్క్ అవుట్ చేస్తున్నాం. కూరగాయల దిగుమతిని సాధ్యమైనంత మేర తగ్గించి ఎక్కువగా వినియోగించే కూరగాయలను స్థానికంగానే ఉత్పత్తి చేయాలనే దిశగా ఆలోచనలు చేస్తున్నాం. - దండా రాజిరెడ్డి, వీసీ, హార్టికల్చర్ యూనిర్సిటీ