కన్నుల పండువగా గెల్వలాంబ మాత ఉత్సవాలు

  • వేలాదిగా భక్తుల రాక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ  

 

వంగూర్, వెలుగు: వంగూరు మండల కేంద్రంలోని శ్రీ గెల్వలాంబ మాత ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. శ్రావణమాసంలో వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా గెల్వలాంబ ఉత్సవాలను నిర్వహిస్తారు. బోయ, రెడ్డి, గౌడ, పద్మశాలి కులస్తులతో పాటు ఆయా కులాలవారు అమ్మవారికి బోనాలను నైవేద్యంగా  సమర్పిస్తారు. 

 పులిపై సవారి చేస్తూ  భక్తులకు మహంకాళి అమ్మవారు దర్శనం ఇస్తుంది.  అమ్మవారిని భక్తులు దర్శించుకొని పూజలు చేస్తారు.  పూర్వం  సంస్థానాధీశులు దండయాత్ర చేసి ఇక్కడి పశు సంపదను, ధన ధాన్యాలను దోచుకొని వెళ్తుండగా గ్రామస్తులు అమ్మవారిని ప్రార్థించడంతో తెలుపు రంగు పశువులను నలుపు రంగులోకి, నలుపురంగు పశువువులను తెలుపు రంగులోకి మార్చి తిరిగి వచ్చే విధంగా చేసిందని స్థానికులు చెబుతుంటారు. 

 అప్పటి నుంచి గెల్వలాంబ మాతను కొలుస్తుంటారు.  ఈనెల 25వ తేదీన బోయ, రెడ్డి, గౌడ, పద్మశాలితోపాటు బీసీ కులాలు అమ్మవారికి బోనాలు సమర్పించి, ఆలయం చుట్టూ ఎడ్లబండ్లతో ప్రదక్షిణ చేస్తారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించినట్లు  ఆలయ చైర్మన్ అందుగుల వెంకటస్వామి తెలిపారు.