టీమిండియా వివాదాస్పద పేస్ బౌలర్ శ్రీశాంత్ మరోసారి బంతితో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో BCCI విధించిన నిషేధపు గడువు ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసింది. ప్రస్తుతం శ్రీశాంత్ పై ఉన్న నిషేధం తొలిగిపోవడంతో ముస్తాక్ అలీ టోర్నీలో ఆడనున్నాడు. టీ20ల్లో ఆడేందుకు ప్రాక్టీస్ చేస్తున్న శ్రీశాంత్‌కు కేరళ జట్టు ప్రాబబుల్ జాబితాలో చోటు దక్కింది.
2007 టీ20, 2011వన్డే ప్రపంచకప్ విజేత జట్టులో శ్రీశాంత్ సభ్యుడిగా ఉన్నాడు. భారత్ తరఫున కేరళకు చెందిన స్పీడ్‌స్టర్ 2011లో చివరిసారి ఆడాడు. అయితే శ్రీశాంత్ ప్రధానంగా IPLపై దృష్టి సారించాడు. ఐపీఎల్ 14వ సీజన్ కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వేలం నిర్వహించనున్నారని సమాచారం. ఈ క్రమంలో దేశవాళీ టీ20 టోర్నీలో రాణించడం ద్వారా IPLలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని శ్రీశాంత్ అనుకుంటున్నాడు. ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో సత్తా చాటిన ఆటగాళ్లకు IPL వేలంలో డిమాండ్ ఉంటుంది. జనవరి 10 నుంచి 31వరకు నిర్వహించే ఈ టోర్నీ 6 రాష్ట్రాల్లో బయోసెక్యూర్ వాతావరణంలో నిర్వహించనున్నారు.
