శ్రీతేజ్ ​ఆరోగ్యం మెరుగుపడుతోంది

  • ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తున్నడు : బాలుడి తండ్రి భాస్కర్
  • కంప్లైంట్  వెనక్కి తీసుకోవాలనుకుంటున్న
  • అల్లు అర్జున్ నుంచి రూ.10 లక్షలే అందాయని వెల్లడి

సికింద్రాబాద్, వెలుగు: శ్రీతేజ్​ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కొంత కుదుటపడుతోందని అతని తండ్రి భాస్కర్  తెలిపారు. సికింద్రాబాద్​ కిమ్స్  వద్ద మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. 20 రోజులుగా శ్రీతేజ్  హాస్పిటల్ లోనే ఉన్నాడని, రెండు రోజుల కింద డాక్టర్లు వెంటిలేటర్స్​ తొలగించారని పేర్కొన్నారు. ‘‘శ్రీతేజ్  ఇప్పుడిప్పుడే కొంత స్పృహలోకి వస్తున్నాడు. కళ్లు తెరుస్తున్నాడు. ఇంజక్షన్లు వేసినపుడు కదులుతున్నాడు. అయితే, ఎవరినీ గుర్తుపట్టడం లేదు. కోలుకోవడానికి ఇంకా టైమ్ పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. 

మెదడులో సెల్స్​రికవరీ జరిగితేనే పూర్తి స్థాయిలో కోలుకుంటాడని తెలిపారు. దానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమంటున్నారు. మా వల్ల అల్లు అర్జున్  అరెస్ట్  అవుతున్నాడని తెలిసి ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నా” అని భాస్కర్ ​పేర్కొన్నారు. అల్లు అర్జున్​పై సానుభూతితోనే ఆయన జైలుకు వెళ్లకూడదనే ఉద్దేశంతో సంఘటన జరిగిన రెండో రోజే తాను కేసు వాపసు తీసుకుంటానని చెప్పానని గుర్తుచేశారు. ఇందులో ఎవరి బలవంతం లేదన్నారు. 

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వచ్చి రూ.25 లక్షల ఆర్థిక సాయం చేశారని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారని వెల్లడించారు. పుష్ప 2 సినిమా నిర్మాతలు నవీన్, రవిశంకర్  కూడా రూ.50 లక్షలు ఇచ్చారని, అల్లు అర్జున్  రూ.25 లక్షలు అనౌన్స్  చేశారని చెప్పారు. అయితే, అర్జున్​నుంచి తమకు రూ.10 లక్షలు మాత్రమే అందాయని, ఇప్పటికీ ఆ చెక్కు తన వద్దే ఉందని భాస్కర్  ​ పేర్కొన్నారు. సుకుమార్  ఫ్యామిలీ, అల్లు అర్జున్​ మనుషులు ఆసుపత్రికి వచ్చి బాలుడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. 

బాలుడికి దిల్​ రాజు, డీకే అరుణ పరామర్శ

శ్రీతేజ్​ను మంగళవారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. వారిలో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి, ఫిలిం డెవలప్ మెంట్  కార్పొరేషన్  చైర్మన్  దిల్  రాజు, డీసీసీ అధ్యక్షుడు రోహిన్​రెడ్డి తదితరులు ఉన్నారు.