IND vs SA 2024: సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు గిల్, జైశ్వాల్ దూరం.. కారణం ఏంటంటే..?

నాలుగు టీ20ల సిరీస్‌‌‌‌ కోసం సౌతాఫ్రికా వెళ్లే టీమ్‌ను భారత సెలెక్టర్లు శుక్రవారం (అక్టోబర్ 25) ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీ20 టీమ్‌‌‌‌లోకి హైదరాబాదీ తిలక్‌‌‌‌ వర్మ తిరిగి రాగా.. మిడిలార్డర్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ రమణ్​దీప్ సింగ్‌‌‌‌, పేసర్‌‌‌‌‌‌‌‌ విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ వైశాక్‌‌‌‌, యష్ దయాల్‌‌‌‌ తొలిసారి ఎంపికయ్యారు. నవంబర్ 8, 10, 13, 15వ తేదీల్లో సౌతాఫ్రికాతో నాలుగు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇదిలా ఉంటే ఈ సిరీస్ కు భారత స్టార్ ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, శుభమాన్ గిల్ లను ఎంపిక చేయలేదు. 

భారత జట్టులో వీరిని సెలక్ట్ చేయకపోవడానికి కారణం లేకపోలేదు. ఐదు టెస్టుల బోర్డర్‌‌‌‌‌‌‌‌–గావస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా టూర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లే ఇండియా టెస్టు జట్టులో జైస్వాల్, గిల్  ఎంపికయ్యారు. నవంబర్ 22 నుంచి పెర్త్‌‌‌‌లో జరిగే తొలి టెస్టుతో ఆస్ట్రేలియా టూర్‌‌‌‌‌‌‌‌ మొదలవుతుంది. భారత్ 10 రోజుల ముందుగానే ఆస్ట్రేలియా టూర్ కు బయలుదేరుతుంది. మరోవైపు నవంబర్ 8 నుంచి సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ప్రారంభవుతుంది. 15 న సిరీస్ ముగుస్తుంది. దీంతో టెస్ట్ జట్టులో ఉన్న వీరిద్దరినీ సెలక్ట్ చేయలేదు.  తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి సైతం ఆస్ట్రేలియా టూర్ కు ఎంపిక కావడంతో అతన్ని సఫారీలతో టీ20 సిరీస్ కు పరిగణలోకి తీసుకోలేదు. 

డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో తొలి టీ20 తో సిరీస్ ప్రారంభమవుతుంది. గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ లో రెండో టీ20 జరుగుతుంది. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌, జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్‌లో వరుసగా మూడు, నాలుగు టీ20 మ్యాచ్ లకు ఆతిధ్యమిస్తాయి. 

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌‌‌‌ కు భారత జట్టు:

సూర్యకుమార్  (కెప్టెన్‌‌‌‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (కీపర్‌‌‌‌‌‌‌‌), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్‌‌‌‌ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌‌‌‌దీప్ సింగ్, విజయ్‌‌‌‌కుమార్ వైశాక్, అవేష్ ఖాన్ , యష్ దయాల్.