క్రీడల హబ్ గా తెలంగాణ : ఏపీ జితేందర్ రెడ్డి

  • క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి

పాలమూరు, వెలుగు: క్రీడల హబ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారుడు ఏపీ జితేందర్ రెడ్డి తెలిపారు. ఇటీవల ఒలంపిక్  సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన జితేందర్ రెడ్డిని జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్​లో గురువారం ఉమ్మడి జిల్లా ఒలంపిక్  సంఘం, క్రీడాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్లుగా బీఆర్ఎస్  సర్కారు క్రీడలను పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వాలు క్రీడాభివృద్ధి కోసం బడ్జెట్​లో రూ.50 కోట్లు ఇస్తే, కాంగ్రెస్  ప్రభుత్వం రూ.370 కోట్లు కేటాయించిందని తెలిపారు. జిల్లా క్రీడాభివృద్ధికి బడ్జెట్ కేటాయించి పనులు చేస్తామన్నారు. 

ఇప్పటికే వాలీబాల్ అకాడమీ మంజూరైందని, సెలక్షన్స్  నిర్వహించి క్రీడాకారులకు శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉమ్మడి జిల్లా ఒలంపిక్  సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్  మాట్లాడుతూ స్పోర్ట్స్  హాస్టల్  ఏర్పాటు చేయాలని, ముఖ్యమైన క్రీడలకు కోచ్ లను నియమించాలని కోరారు. అనంతరం సీఎం కప్  జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో విజేతలకు ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. ఒలంపిక్  సంఘం కార్యదర్శి కురుమూర్తిగౌడ్, జాకీర్, డీవైఎస్ వో ఎస్.శ్రీనివాస్, వివిధ సంఘాల నేతలు దూమర్ల నిరంజన్, జగన్మోహన్ గౌడ్, వడేన్న, విలియం, వేణుగోపాల్, రాంచందర్, నిరంజన్​రావు
 పాల్గొన్నారు.

వనపర్తి: చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్లానింగ్​ బోర్డు వైస్​ చైర్మన్​ చిన్నారెడ్డి సూచించారు. సీఎం కప్  క్రీడల ముగింపు కార్యక్రమాన్ని గురువారం బాయ్స్​ జూనియర్  కాలేజీ గ్రౌండ్​లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్  క్రీడాకారుడని, వనపర్తిలో చదువుకుంటూ ఇదే మైదానంలో ఆటలు ఆడారని గుర్తు చేశారు. కలెక్టర్  ఆదర్శ్  సురభి మాట్లాడుతూ సీఎం కప్​ జిల్లా స్థాయి పోటీల్లో 36 విభాగాల్లో క్రీడలు నిర్వహించగా, 3,600 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. అనంతరం విజేతలకు   మెడల్స్, కప్  అందించారు. డీవైఎస్​వో సుధీర్ రెడ్డి, గవర్నమెంట్​ ప్లీడర్​ కిరణ్ కుమార్, డీపీఆర్వో  సీతారాం పాల్గొన్నారు.

నారాయణపేట: నారాయణపేటను స్పోర్ట్స్  హబ్ గా తీర్చిదిద్దాలని డీసీసీ మాజీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నాలుగో రోజు సీఎం కప్ లో భాగంగా మినీ స్టేడియంలో ఖోఖో పోటీల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రాన్ని ఒలంపిక్  హబ్ గా మార్చాలన్నదే సీఎం లక్ష్యమని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. మార్కెట్  కమిటీ చైర్మన్  సదాశివరెడ్డి, మాజీ చైర్మన్  బండి వేణుగోపాల్, కోట్ల రవీందర్ రెడ్డి, గందే చంద్రకాంత్, మాధవరెడ్డి పాల్గొన్నారు.