కెప్టెన్సీ చేపట్టేందుకు నేను సిద్ధం.. జట్టును పరుగులు పెట్టిస్తా..: బంగ్లా స్పిన్నర్

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ అనంతరం ప్రస్తుత బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో తప్పుకోనున్నాడంటూ కథనాలు వస్తున్నాయి. శాంటో జట్టును నడిపించేందుకు సుముఖంగా లేడని, తన నిర్ణయాన్ని అతను ఇప్పటికే బోర్డుకు తెలియజేసినట్లు బీసీబీ వర్గాలు తెలిపాయి. ఇలాంటి పరిస్థితులలో జట్టును నడిపించడానికి తాను సిద్ధమని ఓ స్పిన్నర్ తెరమీదకు వచ్చాడు. 

కెప్టెన్సీ చేపట్టేందుకు సిద్ధం..

బంగ్లాదేశ్ అనుభవజ్ఞుడైన లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ అవసరమైతే టెస్టు కెప్టెన్సీని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. శాంటో వైదొలుగుతున్న విషయం గురించి అతన్ని సంప్రదించగా.. తనకు తెలియదని సమాధానమిచ్చాడు. ఒకవేళ జట్టుకు కొత్త  నాయకత్వం అవసరమైతే.. రెడ్-బాల్ ఫార్మాట్‌లో తాను నడిపిస్తానని చెప్పుకొచ్చాడు. 

"ఈ విషయంపై (నజ్ముల్ కెప్టెన్సీ నుండి వైదొలగడం గురించి) నేను ఏమీ వినలేదు. దానిపై నాకు ఎలాంటి సమాచారం లేదు. ఒక ఆటగాడిగా తదుపరి సిరీస్‌కు నేను సిద్ధంగా ఉన్నా.. ఒకవేళ మీరు అన్నట్లు కొత్త కెప్టెన్ కోసం బోర్డు అన్వేషిస్తుంటే, 10 ఏళ్ల అనుభవం ఉన్న ఆటగాడిగా కెప్టెన్సీ చేపట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నా.. సహచరుడిగా, ఆటగాడిగా అందరూ నాకు మిత్రులే. ఒక సీనియర్ ఆటగాడిగా అనుకున్న నిర్ణయాలు సమర్థవంతంగా అమలు చేయగలను. జట్టును విజయాల బాటలో నడిపించగలను. ఆ నమ్మకం నాకుంది.."

ALSO READ : Pakistan Cricket: పాకిస్థాన్ వైట్ బాల్ హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్

"మైదానంలో విభిన్న పరిస్థితులు తలెత్తినప్పుడు,  ఉదాహరణకు స్పిన్నర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఫీల్డ్ పొజిషనింగ్ ఎలా సెటప్ చేయాలని కెప్టెన్ కొన్నిసార్లు నన్ను అడుగుతాడు. నేను ఎన్నో సార్లు అలా సహాయం చేశాను.. చేయడానికి ప్రయత్నించాను. సుదీర్ఘ ఫార్మాట్‌లో జట్టును బాధ్యతగా నడిపించగలను. ఇవ్వాలా వద్దా..! అనేది బోర్డు నిర్ణయం.." అని 32 ఏళ్ల స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. 

బంగ్లాదేశ్ vs దక్షిణాఫ్రికా షెడ్యూల్:

  • మొదటి టెస్ట్ (అక్టోబర్ 21 - అక్టోబర్ 25): 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం
  • రెండో టెస్ట్ (అక్టోబర్ 29- నవంబర్ 02): చటోగ్రామ్