ఐపీఎల్‌‌లో కొనసాగనున్న స్పిన్ లెజెండ్‌‌

  •   ఇంటర్నేషనల్ క్రికెట్‌‌కు రిటైర్మెంట్ ప్రకటించిన  రవిచంద్రన్ అశ్విన్‌‌
  •    ఐపీఎల్‌‌లో కొనసాగనున్న స్పిన్ లెజెండ్‌‌

బ్రిస్బేన్:  టీమిండియా స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్‌‌ తన ఇంటర్నేషనల్ కెరీర్‌‌‌‌కు అనూహ్యంగా ముగింపు పలికాడు. బుధవారం ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన తర్వాత రోహిత్ శర్మతో కలిసి మీడియా  సమావేశానికి వచ్చిన అశ్విన్‌‌ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ‘ఇండియా క్రికెటర్‌‌‌‌గా అన్ని ఫార్మాట్లలో  ఇదే నా చివరి రోజు.  మరికొంత కాలం క్రికెట్ ఆడే సత్తా  నాలో ఉందని అనుకుంటున్నా. అయితే, దాన్ని క్లబ్‌‌ లెవెల్ క్రికెట్‌‌లో ఉపయోగిస్తా. ఈ ఆటను నేను ఎంతో ఆస్వాదించాను. రోహిత్‌‌, మరెంతో మంది తోటి ఆటగాళ్లతో కలిసి ఎన్నో  అనుభూతులను సృష్టించుకున్నా.  బీసీసీఐ, నా తోటి ఆటగాళ్లతో పాటు ఎంతో మందికి నేను థ్యాంక్స్ చెప్పాలి.ముఖ్యంగా రోహిత్‌‌, విరాట్, పుజారా, రహానె వంటి వాళ్లు ఇన్నేండ్లలో నా బౌలింగ్‌‌లో వందల క్యాచ్‌‌లు పట్టి నాకు వికెట్లు అందించారు. 

ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌‌కు కూడా థ్యాంక్స్‌‌. ఆ టీమ్‌‌తో ఆటను నేను ఎంజాయ్ చేశాను’ అని అశ్విన్ పేర్కొన్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి అశ్విన్ మొత్తంగా 756 వికెట్లు పడగొట్టాడు. కెరీర్‌‌‌‌లో 106 టెస్టులు ఆడిన అతను 537 వికెట్లు తీశాడు. అనిల్ కుంబ్లే  (619)తర్వాత ఈ ఫార్మాట్‌‌లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియా బౌలర్‌‌‌‌గా నిలిచాడు. ఓవరాల్‌‌ జాబితాలో ఏడో బౌలర్‌‌‌‌గా ఉన్నాడు.  క్లబ్‌‌ క్రికెట్‌‌లో కొనసాగుతానని చెప్పిన అశ్విన్ వచ్చే ఐపీఎల్‌‌లో సీఎస్కే తరఫున కెరీర్‌‌‌‌ కొనసాగించనున్నాడు. మీడియా సమావేశం తర్వాత  డ్రెస్సింగ్‌‌కు వెళ్లి తోటి ఆటగాళ్లను హగ్ చేసుకొని సెండాఫ్​ ఇచ్చాడు. జట్టు నుంచి తప్పుకుంటున్నా.. ఎవ్వరికి  ఏ అవసరం ఉన్నా తాను ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటానని చెప్పాడు.  ‘ప్రతి ఒక్కరికీ తప్పుకొనే టైమ్‌‌ వస్తుంది. ఈ రోజు నా సమయం వచ్చింది' అని తన వీడ్కోలు ప్రసంగంలో అశ్విన్‌‌  పేర్కొన్నాడు.