వందే భారత్ రైళ్ల వేగం తగ్గింది

వందే భారత్ రైళ్ల వేగం తగ్గింది

న్యూఢిల్లీ: వందే భారత్  రైళ్ల సగటు వేగం తగ్గింది. 2020–21లో గంటకు 84.48 కిలోమీటర్లు ఉన్న సగటు వేగం 2023–24లో గంటకు 76.25 కిలోమీటర్లకు తగ్గింది. మధ్య ప్రదేశ్​కు చెందిన చంద్రశేఖర్  గౌర్  అనే వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ అప్లికేషన్​కు రైల్వే శాఖ జవాబిచ్చింది. ఇతర ట్రెయిన్లు కూడా కాస్త వేగం తగ్గించి నడిపిస్తున్నట్లు అధికారులు చెప్పారు.  

మౌలిక సదుపాయాల పనులు జరుగుతున్న ప్రాంతాల్లో మాత్రమే రైళ్ల వేగం తగ్గించామని చెప్పారు. ‘‘గత నాలుగైదేండ్లలో కఠినమైన నేలలు ఉన్న ప్రాంతాల్లో వందే భారత్​తో పాటు పలు రైళ్లను లాంచ్ చేశాం. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భౌగోళిక కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో రైళ్ల వేగం తగ్గించి నడపాల్సి వస్తున్నది. కొంకణ్  రైల్వే ఏరియాలో రైళ్లు తక్కువ ఎత్తు ఉన్న పర్వత శ్రేణుల మీదుగా వెళతాయి. అలాంటి ప్రాంతాల్లో రైళ్లను స్పీడ్ గా నడిపితే సేఫ్టీ ఉండదు” అని అధికారులు పేర్కొన్నారు.