ఫ్యాషన్ మార్కెట్ లో ఖున్ ఫ్యాబ్రిక్ ను బ్రాండ్ గా మార్చింది

ఫ్యాషన్ మార్కెట్ లో ఖున్ ఫ్యాబ్రిక్ ను బ్రాండ్ గా మార్చింది

కర్నాటకలోని బాగల్​కోట జిల్లా, గుళేదగుడ్డ.. ఇంతకుముందు ఈ ఊరిలో ఏ వీధికెళ్లినా​ ఖున్​​తో రంగురంగుల బట్టలు నేస్తూ కనిపించేవాళ్లు అంతా. కానీ, కాలంతో పాటు వేల ఏండ్ల చరిత్ర ఉన్న ఆ కళ కనిపించకుండా పోయింది. ఆ ఊరి వాళ్లు దాని ఊసే మర్చిపోయారు. అయితే ఆ ఫ్యాబ్రిక్​తో అల్లుకున్న తన చిన్ననాటి గుర్తుల్ని అంత తేలిగ్గా మర్చిపోలేక పోయింది జానవి కులకర్ణి. ఆ ట్రెడిషనల్​ ఫ్యాబ్రిక్​ని మళ్లీ జనాల్లోకి తీసుకురావాలనుకుంది. ఫ్యాషన్​ మార్కెట్​లో దాన్నొక బ్రాండ్​గా మార్చాలనుకుంది. ఇప్పుడు యు.ఎస్.​, యు.కె., సింగపూర్​, ఆస్ట్రేలియా, జర్మనీ.. లాంటి దేశాలకి​ ఖున్​తో చేసిన డ్రెస్​లు, జువెలరీ, డెకరేషన్​ ఐటమ్స్​ పంపిస్తోంది. 

కాటన్​​, కాటన్​ సిల్క్​తో కలిపి​ నేసిన ఫ్యాబ్రిక్​ ఖున్. దీన్నే ‘ఖానా’ ​అని కూడా పిలుస్తారు. ఎనిమిదవ శతాబ్దంలో చాళుక్యులు ఈ ఫ్యాబ్రిక్​తో నేసిన బట్టలు వేసుకున్నారట. ఆ తర్వాత ఈ మెటీరియల్​తో చేసిన బ్లౌజులు కర్నాటక, మహారాష్ట్రలో బాగా పాపులర్​ అయ్యాయి. ముఖ్యంగా కర్నాటకలోని గుళేదగుడ్డ, ధార్వాడ్​లో ఈ కుట్టునే వృత్తిగా మార్చుకున్నారు చాలామంది. అందుకే ఈ ఫ్యాబ్రిక్​కి గుళేదగుడ్డ, ధార్వాడ్​ ఖున్​ అని పేరుంది. ఆ ప్రాంతంలోనే పుట్టి, పెరిగిన జానవికి చిన్నప్పట్నించీ ఈ ఫ్యాబ్రిక్​ మీద తెలియని ఇష్టం ఏర్పడింది. 

ఇష్టం మరింత పెరిగింది

జానవి తల్లితో పాటు, ఇరుగు పొరుగు ఇండ్లలోని ఆడవాళ్లు.. ఖున్ ఫ్యాబ్రిక్​తో బ్లౌజులు, డోర్​ మ్యాట్​లు, డెకరేషన్​ ఐటమ్స్ తయారుచేసేవాళ్లు. అవన్నీ చూసి నాలుగో తరగతి నుంచే..తన బొమ్మలకి డ్రెస్​లు కుట్టింది జానవి. పెరిగి, పెద్దవుతున్న కొద్దీ  కుట్లు, అల్లికల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంది. ఆ ఆలోచనతోనే ముంబైలోని ఎస్​ఎస్​డిటి యూనివర్సిటీలో 1999లో టెక్స్​టైల్స్​ కోర్సు పూర్తి చేసింది. యూనివర్సిటీలో గోల్డ్​మెడల్​ సాధించి ఒక ఎక్స్​పోర్ట్​ కంపెనీ హౌస్​లో ఉద్యోగానికి చేరింది. దాని తర్వాత ఒక ఫర్నిచర్​​ బ్రాండ్​కి పనిచేసింది. ఆ తర్వాత పెండ్లి, బిడ్డలతో  బెంగళూరులో బిజీగా ఉన్నా.. ఏదో తెలియని వెలితి వెంటాడిందామెని. 

మళ్లీ తీసుకురావాలని

నాలుగువేల ఏండ్ల చరిత్ర ఉన్న ఖున్​ ఫ్యాబ్రిక్ మార్కెట్​లో కనిపించకపోవడం బాధపెట్టిందామెని. బెనారస్​, కలంకారి, మైసూర్​ సిల్క్​, ఫ్యాబ్రిక్స్​తో సమానంగా ఖున్​కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవాలనుకుంది. ఆ ఆలోచనకి భర్త ఆనంద్​ కూడా అండగా నిలిచాడు. దాంతో  2012 లో కాలేనాలే  బ్రాండ్​ని మొదలుపెట్టింది. గుళేదగుడ్డ, ధార్వాడ్​లో వీవర్స్​ నుంచి ఖున్​ ఫ్యాబ్రిక్​ని సేకరించింది. సంవత్సరం పాటు  దిండు కవర్లు, బ్లౌజులు కుట్టింది. తనపై తనకి నమ్మకం వచ్చాక వీవర్స్​ని కలిసింది.

ఖున్​ బ్లౌజులు ఎప్పట్నించో ఉన్నవేకానీ, అందరికీ రీచ్​ కావాలంటే  డిఫరెంట్​గా ట్రై చేయాలనుకుంది జానవి.  ఖున్​తో చీరలు, దుపట్టాలు, డోర్​ మ్యాట్స్​, స్టోల్స్​,  జువెలరీ, డెకరేషన్​ ఐటమ్స్, ఐపాడ్​ కవర్స్​, బ్యాగ్స్​ ​ తయారుచేయాలనుకుంది. ఈ ఆలోచనతో వీవర్స్​ని కలిస్తే 31 అంగుళాల పొడవు, ఆరు అంగుళాల అంచు ఉండే ఖున్​ ఫ్యాబ్రిక్​తో  ఇవన్నీ కష్టమన్నారు. పైగా చీరలు నేసేందుకు  వీలయ్యే మగ్గాలు కూడా లేవు వాళ్లదగ్గర . దాంతో  మగ్గాల సైజు పెంచడానికి వాళ్లని ఒప్పించేందుకు చాలా కష్టపడింది జానవి.  ప్రొడక్ట్స్​ రిజెక్ట్​ అయినా వెనక్కి తగ్గలేదామె.. తనని తాను బెటర్​ చేసుకుంటూ మరింత ముందుకెళ్లింది.  ఇప్పుడు కోట్లలో టర్నోవర్​ సంపాదించింది. 

“ఇద్దరు పిల్లల బాధ్యతతో ఇదంతా చేయడం చాలాసార్లు కష్టం అనిపించింది. కానీ, నా విజన్​పై నాకున్న నమ్మకం, వీవర్స్​ స్కిల్స్​పై ఉన్న భరోసా నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఖున్​ ప్రొడక్ట్స్​కి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్​ ఉంది.  నన్ను చూసి మా చుట్టుపక్కల ఊళ్లలోని  వీవర్స్​ కూడా మళ్లీ మగ్గం ఎక్కుతున్నారు ’’అంటోంది జానవి.