దగాపడ్డ ఉద్యమకారుడు జిట్టా బాలకృిష్ణా రెడ్డి

మన భోనగిర్ల  నువ్వు పెట్టిన తెలంగాణ జాతర యాదొస్తుందే.  మూడ్రోజులు ఎంత మురిపెంగా జేస్తివన్న.  ఒగ్గు కథ  నుంచి యక్షగానం దాకా... బగార బువ్వ నుంచి సర్వపిండి దాకా... గంగెడ్ల ఆట నుంచి ధూంధాం పాట దాకా... అన్ని ఒక్కకాడ్నే సూపియ్యాలనే బుద్ది ఎట్ల పుట్టిందే జిట్టన్న.  ఆ దినం భోనగిరి గుట్టకు రంగు రంగు లైట్లు అద్దినవ్ సూడు..ఇంకా కండ్లల్ల మెదుల్తున్నయే.  కాలేజీ  పిలగాలం కాయిశ్ వడి ఉర్కొచ్చినం...మన జాతరంటే.స్టేజీ మీద పెద్దపెద్ద ఆటగాళ్లు, పాటలు ఆడుతుంటే...పాడుతుంటే మా సంబురం అనిపిచ్చిందే.  ఆఖరినాడు  కేసీఆర్ సారొస్తే... నువ్వు కత్తి చేతిల పెట్టిన బొమ్మ ఇంకా మతికున్నదే బాలన్న. అది సూసిగదే...పట్నం నిజాం కాలేజీ తెలంగాణ సంబురాలు పెట్టింది.

ఢిల్లీలో ధూంధాం జేసింది. మన గల్లీల షురైతే అది ఢిల్లీ దాకవోయిందంటే...అదంత నీ ఇకమతేనే.  భోనగిరి గడ్డ మీద నువ్వు జేసిన ఉద్యమాలు ఎవలన్న యాదిమారుస్తరే.  మావోళ్లు ఫ్లోరైడ్ నీళ్లు తాగొద్దని ఊరూర వాటర్ ఫిల్టర్లు పెట్టిస్తివి. మిషన్ భగీరథ స్కీమోచ్చినా..నువ్వు పెట్టిచ్చిన ఫిల్టర్ నీళ్లే తాగుతుండ్రే మనోళ్లు. మన భూములను ఆగం జేస్తున్న మూసీ నదిని త్యాటగ జెయ్యాలని తండ్లాడ్తివి.  పంటలకు ఇన్ని నీళ్లియ్యాలని బునాదిగాని కాలువల పని భుజానికెత్తుకుంటివి.  భోనగిర్ల పడావ్ పడ్డ  గౌర్మెంట్ కాలేజీ కూలగొట్టి అంత పెద్ద బంగ్లా కట్టిచ్చినవంటే మాటలానే జిట్టాన్న.  అండ్ల సదివినోళ్లు నిన్ను మరుస్తరానే జెప్పు.  మన ఏరియాల ఏ ఊరికన్నవోదాం...జిట్టా తెల్వనోళ్లుంటే సూడు. 

మా జిట్టా...మా భోనగిరి గుట్ట

నిఖార్సైన ఉద్యమకారులు అనంగనే నువ్వే గుర్తొస్తవే.  ఐదా..పదా...లెక్క లేనన్ని పోరాటాలు. ముంగట నిలవడి కొట్లాడినవ్.  అప్పట్ల నిన్ను ఏటీఎమ్ కార్డు లెక్క వాడుకున్నోళ్లు...అటెన్క కూరల కలెమాకు లెక్క తీసిపడేసిండ్రు. ఉద్యమం పేర్మిన కోట్లు కమాయించినోళ్లను సూసినం...నువ్వేమో ఉన్నయి అమ్ముకున్నవ్.  ఎన్నడు జై తెలంగాణ అననోడు మంచి మంచి పదవులు సంపాయిస్తే... నువ్వు ఎన్నడు ఏ పార్టీల ఉన్నవో  తెల్వకుంటైంది. కని ఉన్నది ఉన్నట్టు ఓ మాట జెప్పాల్నే.  నువ్వు నమ్ముకున్న పార్టే కాదు...నువ్వు నమ్మిన మన జనం సుత కొంత నియత్ దప్పిండ్రే జిట్టాన్న.

ఒగపారిగాకున్న ఒగపారన్న గెలిపించేదుండే.  నువ్వు ఉండాల్సిన జాగల ఇయ్యాల ఎవలెవలో వచ్చి ఏలవట్టిరి. చీమలు పెట్టిన పుట్టల పాములు జొర్రినట్టు. అదేందోగని...నువ్వు కండువాలు మార్శినా అందరు నీకే ఇమ్మతి ఇచ్చేదే. ఏ...పోతేవోయిండు తీయ్..అండ్లనన్న ఓ పదవొస్తే సాలు అన్కున్నరు శానమంది. గమ్మతేందంటే...నువ్వెప్పుడు ప్రతిపక్షమే ఐనవ్. అంత కొట్లాడితే టీఆర్ఎస్  పవర్లకొచ్చిన్నాడు నువ్వు ఏరే పార్టీలుంటివి.

పదేండ్లు ఆళ్ల మీద కొట్లాడి కొట్లాడి..అది ఓడివోతున్న యాల్ల మల్ల కారెక్కినవ్. ఏదైతే అదైందని అట్లనే కాంగ్రెస్ల ఉంటే...ఇయ్యాల ఏదో ఒగ పదవిల ఉండేటోనివే పక్కా.  కుల్లంకుల్ల జెప్పాలంటే నీకు రాజకీయం తెల్వదన్న. సేవ జేస్తే సాలు, నలుగురి తిప్పలు అర్సుకుంటే సాలు, ఉద్యమకారున్ని ఆళ్లే గెలిపిస్తరు అన్కున్నట్టున్నవ్.   నీ కులం, నీ భోనగిరి బలం, నీ ఉద్యమం ఏదీ నీకు రాజకీయంగా ఆసరాగాలే.  కానీ, జిట్టన్న కాలం జేసిండంటే పార్టీలు, జెండాలు పక్కకు పడేశొచ్చి నీ పాడె మోసిండ్రన్న. ఇదొక్కటైతే సంపాయించుకున్నవ్.  తెలంగాణ ఉద్యమ చరిత్రల భోనగిరి గుట్ట లెక్క జిట్టా పేజీ పైలంగనే ఉంటదన్న.  జోహార్.

- రఘు భువనగిరి