భారత రాజ్యాంగంలో ప్రత్యేక వర్గాలకు ప్రత్యేక అవకాశాలు

భారతదేశం అభివృద్ధి చెందుతున్న సమాజం. ప్రపంచీకరణ తర్వాత దేశం గొప్ప ఆర్థిక ప్రగతిని సాధించింది. అయినా వల్నరబుల్​, మార్టినలయిజ్డ్​ వర్గాలు పెద్ద ఎత్తున మిగిలిపోయాయి. ఈ వర్గాల అభివృద్ధి గురించి విధానాల్లో ఏర్పాటు చేయడం ప్రభుత్వం ముందు ప్రధాన ఎజెండాగా మిగిలింది. మహిళలు, పిల్లలు, షెడ్యూల్డ్​ కులాలు, షెడ్యూల్డ్​ జాతులు, ఇతర వెనుకబడిన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, ట్రాన్స్​జెండర్​ వర్గాలు, వయోధికులు తదితరులను వల్నరబుల్, మార్జినలయిజ్డ్​ వర్గాలుగా భావించి ప్రభుత్వం ఎన్నో విధానాత్మకమైన ఏర్పాట్లను చేపడుతున్నది. 

 సమాజం ఒత్తిడికి లోనైన వీరు సాంఘిక, సాంస్కృతిక కారణాల పరంగా ప్రధాన మార్గంలో నడవలేకపోతారు. షెడ్యూల్డ్​ కులాలు, షెడ్యూల్డ్​ జాతులు, వికలాంగులు, వయోవృద్ధులు మొదలైనవారు మార్జినలైజ్డ్​ వర్గాల కిందకి వస్తారు. చాలా సందర్భాల్లో వల్నరబుల్​, మార్జినలయిజ్డ్​ వర్గాల మధ్యలో తేడా కనిపించదు. వల్నరబుల్​ వర్గాల వారికి సమాజంలో సరైన చోటు దొరకదు. కాబట్టి సమాజం వారిని పక్కకు నెడుతుంది. ఈ రెండు వర్గాల వారికి సరైన రక్షణ కల్పించే మార్గాలను ఎన్నింటినో భారత రాజ్యాంగం ఏర్పాటు చేసింది.

ప్రత్యేక వర్గాలకు ప్రత్యేక అవకాశాలు 

  • రాజ్యాంగంలోని 16వ భాగంలో 330 నుంచి 342 వరకు గల అధికరణల్లో ప్రత్యేక వర్గాలకు కల్పించిన ప్రత్యేక అవకాశాలను తెలిపారు. 
  • ఆర్టికల్​ 330: లోక్​సభలో ఎస్సీ(84), ఎస్టీ (47)లకు రిజర్వు చేయాల్సిన సీట్లను గురించి తెలుపుతుంది. 
  • ఆర్టికల్ 332: శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీలకు కల్పించే రిజర్వేషన్లు గురించి తెలుపుతుంది. 
  • ఆర్టికల్ 334: ఆయా వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లు 60 సంవత్సరాల తర్వాత రద్దవుతాయి. 334 ఆర్టికల్​ ప్రకారం భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి 10 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్లు అంతరించిపోతాయని పేర్కొన్నారు. కానీ, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రాజ్యాంగ సవరణ ద్వారా 334 అధికరణను సవరిస్తూ రిజర్వేషన్ల కాల పరిమితిని పొడిగించారు. 
  •     
  • 1960లో ఎనిమిదో రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్ల కాలపరిమితిని 20 ఏండ్లకు అంటే 1960 నుంచి 1970 వరకు పొడిగించారు. 
  •     
  • 1970లో 23వ రాజ్యాంగ సవరణ ద్వారా 20 సంవత్సరాలకు బదులుగా 30 సంవత్సరాలకు అంతరించిపోతాయని సవరించడం వల్ల 1970 నుంచి 1980 వరకు రిజర్వేషన్లు పొడిగించారు.
  •     
  • 1980లో చేసిన 45వ రాజ్యాంగ సవరణను అనుసరించి రిజర్వేషన్ల కాలపరిమితిని 40 ఏండ్లుగా పేర్కొనడం ద్వారా 1980 నుంచి 1990 వరకు రిజర్వేషన్లు పొడిగించారు. 
  •     
  • 1989లో చేసిన 62వ రాజ్యాంగ సవరణను అనుసరించి రిజర్వేషన్ల కాలపరిమితిని 50 ఏండ్లకు పొడిగించడం ద్వారా 1990 నుంచి 2000 వరకు రిజర్వేషన్లు పొడిగించారు. 
  •     
  • 2000లో 79వ రాజ్యాంగ సవరణ ప్రకారం రిజర్వేషన్ల కాల పరిమితిని 60 సంవత్సరాలకు పెంచడం ద్వారా రిజర్వేషన్లను 2000 నుంచి 2010 వరకు పొడిగించారు. 
  •     
  • 2010లో చేసిన 95వ సవరణను అనుసరించి రిజర్వేషన్ల కాలపరిమితిని 70 సంవత్సరాలకు పెంచడం ద్వారా రిజర్వేషన్లను 2010 నుంచి 2020 వరకు పొడిగించారు. 
  •     
  • 104వ రాజ్యాంగ సవరణను అనుసరించి పార్లమెంట్​లోనూ శాసనసభల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన ప్రత్యేక రిజర్వేషన్లు 2020 నుంచి 2030 వరకు పొడిగించారు. అంటే ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో కల్పించిన రిజర్వేషన్లు రాజ్యాంగం అమలులోకి వచ్చిన 8‌‌0 సంవత్సరాల తర్వాత అంతరించిపోతాయని పేర్కొన్నారు. 
  • ఆర్టికల్ 335: ప్రభుత్వం కల్పించే అవకాశాల్లో ఏ వర్గానికైనా సరైన ప్రాతినిధ్యం లభించలేదని ప్రభుత్వం భావించినప్పుడు ఆ వర్గాలకు ప్రత్యేక అవకాశాలు కల్పించవచ్చు. ప్రత్యేక అవకాశాలు కల్పించే సందర్భంలో సాధారణ పరిపాలనా సామర్థ్యానికి భంగం కలగకుండా చర్యలు చేపట్టాలి. 
  • ఆర్టికల్​ 338: భారత రాష్ట్రపతి ఎస్సీల స్థితిగతులపై అధ్యయనం చేసి వారి సంక్షేమానికి చర్యలు సూచించాల్సిందిగా కోరుతూ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయవచ్చు. 
  • ఆర్టికల్ 338ఏ: రాష్ట్రపతి ఎస్టీల స్థితిగతులపై అధ్యయనం చేసి వారి సంక్షేమానికి సూచనలు చేయాలని కోరుతూ ప్రత్యేక కమిషన్​ను ఏర్పాటు చేయవచ్చు. 
  • ఆర్టికల్ 339: ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యల గురించి కేంద్రం రాష్ట్రాలను ఆదేశిస్తుంది. రాష్ట్రాలు వాటిని తప్పనిసరిగా పాటించాలి. 
  • ఆర్టికల్ 340: భారత్​లోని ఇతర వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం తగిన చర్యలు సూచించాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతి ప్రత్యేక కమిషన్​ను ఏర్పాటు చేయవచ్చు. 
  • ఆర్టికల్ 341: రాష్ట్రపతి ఆయా రాష్ట్రాల గవర్నర్లను సంప్రదించిన తర్వాతే ఎస్సీల నిర్వచనాన్ని నోటిఫికేషన్​ ద్వారా తెలుపుతారు. రాష్ట్రపతి నోటిఫికేషన్​ను అనుసరించి పార్లమెంట్​ చట్టాలు చేస్తుంది. ఈ చట్టాలపై న్యాయస్థానాల్లో సవాల్​ చేయరాదు. 
  • ఆర్టికల్​ 342: రాష్ట్రపతి ఆయా రాష్ట్రాల గవర్నర్లను సంప్రదించి ఎస్టీల నిర్వచనాన్ని నోటిఫికేషన్ ద్వారా తెలుపుతారు. దీనిని అనుసరించి పార్లమెంట్​ చట్టాలు చేస్తుంది. ఈ చట్టాలను ఏ న్యాయస్థానంలోనూ సవాల్​ చేయరాదు. 

ఆదేశిక సూత్రాలు

  • ఆర్టికల్ 38: దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 38ఏ ప్రకారం ఆర్థికంగా సామాజికంగా వ్యక్తులు, వర్గాల మధ్యన మన దేశంలో పెరుగుతున్న అసమానతలను తగ్గించడానికి చర్యలు చేపట్టడం.
  • ఆర్టికల్ 39: సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా సంపదను, సహజ వనరులను ప్రజలందరి సమష్టి ప్రయోజనం కోసం వినియోగించడం.
  • ఆర్టికల్​ 39ఏ: ప్రజలకు ఉచిత న్యాయ సేవా సహాయం అందించడం.
  • ఆర్టికల్ 41: తగినంత జీవనోపాధి లేదా జీవనభృతిని కల్పించడం.
  • ఆర్టికల్​ 42: మాతా శిశు సంక్షేమం కోసం పాటుపడటం.
  • 43: కనీస వేతన చట్టాలను రూపొందించడం.
  • ఆర్టికల్​ 44: ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రజలందరికీ ఒకే విధంగా వర్తించేటట్లు కామన్ సివిల్​ కోడ్​ను ఏర్పాటు చేయాలి. 
  • ఆర్టికల్​ 46: సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వాలు ప్రత్యేక అవకాశాలు కల్పించాలి.
  • మద్రాస్ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ చట్టాన్ని చంపకం దొరైరాజన్ కేసులో సుప్రీంకోర్టు కొట్టివేసింది. మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 15(4), 16 (4) అధికరణలను రాజ్యాంగంలో చేరుస్తూ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించారు.
  • ఆర్టికల్ 366 (25): ఎస్సీలకు సంబంధించిన నిర్వచనాలను వారికి కల్పించిన నియమ
  • నిబంధనలు, రక్షణలు వాటి అమలుకు సంబంధించిన అంశాలపై వివరణ ఇస్తున్నది.
  • ఆర్టికల్ 350(ఏ): మాతృభాషలో విద్యా బోధన కోసం కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేయవచ్చు.
  • ఆర్టికల్ 350 (బి): మైనార్టీ భాషల అమలు, సంక్షేమం కోసం కేంద్రం ఆదేశాలను జారీ చేయవచ్చు.
  • 275(1): ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తన సంఘటిత నిధి నుంచి నిధులను విడుదల చేస్తుంది.
  • 243 (డి): పంచాయతీరాజ్​ సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు.
  • 243(టి): పట్టణ, నగరపాలక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు.  
  • స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించడానికి ఆయా వర్గాల నుంచి సభ్యులను కో–ఆప్షన్​ చేసుకునే అవకాశం కల్పించారు. 
  • ఆర్టికల్ 331: పార్లమెంట్​కు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్​ చేస్తారు.
  • ఆర్టికల్​ 333: రాష్ట్ర విధానసభకు ఒక ఆంగ్లో ఇండియన్​ను గవర్నర్​ నియమించవచ్చు. 2020లో 104వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్​సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నియమించే అంశాన్ని, రాష్ట్రాల్లోని విధానసభలకు ఒక ఆంగ్లో ఇండియన్​ను నియమించే అంశాన్ని రాజ్యాంగం నుంచి తొలగించారు.