- రాంచీ ఎస్ఎస్పీ సురేంద్ర కుమార్ ఝా
అల్లర్ల తర్వాత జార్ఖండ్ లో పరిస్థితి కుదుటపడుతోందని రాంచీ ఎస్ఎస్పీ సురేంద్ర కుమార్ ఝా వెల్లడించారు. ప్రశాంతత నెలకొనడంతో ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా పునరుద్ధరించామని ఆయన చెప్పారు. అల్లర్లకు సంబంధించి నిందితులు, అనుమానితులపై ఇప్పటి వరకు 25 కేసులు పెట్టామని ఆయన వివరించారు. అల్లర్లతో సంబంధం ఉన్నట్లు అనుమానాలున్న వారిని ప్రశ్నించి ఇప్పటివరకు 22 మందిని నిందితులుగా గుర్తించామని తెలిపారు. మరికొందరు నిందితులను గుర్తించాల్సి ఉందని ఆయన చెప్పారు.
హింసపై విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేశామని సురేంద్రకుమార్ తెలిపారు. అలాగే అల్లర్లు శరవేగంగా విస్తరించడానికి ప్రధాన కారణమైన సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నామని, ఎవరైనా, ఎక్కడైనా రెచ్చగొట్టేలా పోస్టులు చేసినా.. అటువంటి హ్యాష్ టాగ్ లు జతచేసి పెట్టినా అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మరోసారి అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ రాంచీలో ప్రత్యేక పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు.
