వైజాగ్ టూర్ కోసం స్పెషల్ ప్యాకేజీలు

వైజాగ్ టూర్ కోసం స్పెషల్ ప్యాకేజీలు

విశాఖ అందాలను చూసేందుకు వచ్చే పర్యాటకుల్లో ఎక్కువ మంది బీచ్ లకే ప్రాధాన్యత ఇస్తారు. దీంతో ప్రభుత్వం కూడా బీచ్ ల అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇస్తోంది. భీమిలి, సాగర్  నగర్ , అప్పికొండ, పూడిమడక, తంతడి బీచ్ లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేసింది. పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తున్న ప్రాంతాలు, మౌలిక వసతులు లేని సందర్శన స్థలాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. కొద్దిరోజుల క్రితం  అమరావతిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో దీనిపైనే ఎక్కువ చర్చ జరిగింది.

విశాఖ జిల్లాలో ఎన్నో జలపాతాలున్నాయి. చాపరాయి, కొత్తపల్లి వంటి ప్రముఖ జలపాతాలకే మౌలిక వసతులు సమకూర్చారు. ఇంకా అభివృద్ధి చేయాల్సినవి చాలా ఉన్నాయని పర్యాటక గుర్తించింది. మొదట మూడు జలపాతాలకు సౌకర్యాలు సమకూర్చాలని ప్రతిపాదించారు. అనంతగిరిలోని కటిక, దేవరాపల్లిలోని సరియా , హుకుంపేటలోని పెదబయలు జలపాతాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ జలపాతానికి వెళ్లే సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. అక్కడి జలపాతంలో చేపలను స్థానికులు దేవతలుగా ఆరాధిస్తున్నారు. దానిని కూడా అభివృద్ధి చేస్తే పర్యాటకంగా మంచి ఆదరణ పొందుతుందని భావిస్తున్నారు అధికారులు.

జిల్లాలో ఉన్న అనేక రిజర్వాయర్లు…. ప్రకృతి అందాలతో కనువిందు చేస్తాయి. వాటిలో సురక్షితమైన వాటిలో బోటు షికారు ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రాలుగా మార్చాలని పర్యాటక శాఖ అధికారులు ప్రతిపాదించారు. తాండవ, రైవాడ రిజర్వాయర్లతో పాటు కొండకర్ల ఆవను కూడా బోటు షికారుకు అనువుగా మార్చాలని భావిస్తున్నారు.

బీచ్ లు, జలపాతాలు, రిజర్వాయర్లులను కలుపుతూ ఒక టూర్ ప్యాకేజిని తయారు  చేస్తున్నారు. విశాఖ వచ్చే సందర్శకులు ముందు బీచులు, తరువాత నగరంలోని, పరిసర ప్రాంతాల్లో ఉన్న రిజర్వాయర్లు… ఏజెన్సీలోని జలపాతాలు చూసేలా టూరిజం శాఖ ప్యాకేజీని సిద్ధం చేస్తోంది. విశాఖలో వాటర్ టూరిజం పేరుతో దీనిని సిద్ధం చేస్తున్నారు.

పర్యాటక శాఖ చేస్తున్న ఈ ప్యాకేజ్ ప్రయోగం సక్సెస్ అవుతుందని అంటున్నరు స్థానికులు.