సభ నిర్వహణలో స్పీకర్ మార్క్​

  • అన్ని పక్షాలకూ మాట్లాడే అవకాశం 
  • పలుమార్లు బీఆర్ఎస్అడ్డుకున్నా ప్రొసీడింగ్స్
  • ఒక్క సభ్యుడినీ సస్పెండ్ చేయకుండా సభ నడపడం ద్వారా రికార్డ్ 
  • స్పీకర్ గడ్డం ప్రసాద్​కు సీఎం సహా పలువురి కితాబు 

హైదరాబాద్, వెలుగు: ఈ సారి అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తనదైన ముద్ర వేశారు. ఈ నెల 9న సభ ప్రారంభం కాగా, ఏడు రోజుల్లో అన్ని పక్షాలకూ వారి వారి సంఖ్యకు అనుగుణంగా మాట్లాడే అవకాశం కల్పించారు. పలుమార్లు సభకు బీఆర్ఎస్ అడ్డుతగిలినా సంయమనంతో వ్యవహరించి, ప్రొసీడింగ్స్​సాఫీగా నడిచేలా చూశారు. అడ్డుపడ్డ బీఆర్ఎస్​సభ్యులను సైతం చర్చలో పాల్గొనాలని సూచిస్తూ సభను నడిపించిన తీరు ఆకట్టుకుంది. 

ఇక క్వశ్చన్ అవర్, జీరో అవర్ ను సమర్థవంతంగా నిర్వహిస్తూనే పలుమార్లు గందరగోళ పరిస్థితుల నడుమ మున్సిపల్ సవరణ బిల్లులు, పంచాయతీ రాజ్ సవరణ బిల్లు, భూభారతి బిల్లు, రైతు భరోసా వంటి కీలక బిల్లులు ఆమోదంలో పొందడంలో స్పీకర్ ముఖ్య పాత్ర పోషించారు. ఇతర సీనియర్ సభ్యులు స్పీకర్లుగా బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కువ శాతం స్పీకరే సభను నడిపించడం మరో విశేషం.  

బీఆర్ఎస్ రచ్చ చేసినా సంయమనం 

ఈ నెల 20న భూభారతి బిల్లుపై సభలో జరిగిన చర్చకు బీఆర్ఎస్​సభ్యులు అడుగడుగునా అడ్డుతగిలారు. ఫార్ములా–ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ సభలో గందరగోళం సృష్టించారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరపాలని నినాదాలు చేస్తూ వెల్ లోకి, స్పీకర్ పోడియం వైపు దూసుకొచ్చారు.

 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జగదీశ్ రెడ్డి తమ చేతిలోని పేపర్లను, ఆఫీసర్ల టేబుల్ ముందు ఉన్న పేపర్లను లాక్కొని స్పీకర్ పైకి విసిరేశారు. స్పీకర్ సీటు దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి హరీశ్​రావు ఎమ్మెల్యే వివేకానందను తోసుకుంటూ స్పీకర్​పోడియంను టచ్​చేశారు. భూభారతి బిల్లు గురించి వివరిస్తున్న మంత్రి పొంగులేటి స్పీచ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

ఈ ఘటన జరుగుతున్నంతసేపు స్పీకర్ సంయమనంతో వ్యవహరించారు. చర్చను పక్కదోవ పట్టించవద్దని విజ్ఞప్తి చేస్తూనే సభను పలుమార్లు వాయిదా వేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, విప్ లు, ఇతర పక్షాల సభ్యుల నుంచి స్పీకర్​పై ఒత్తిడి పెరిగింది. కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కీలకమైన భూభారతి బిల్లుపై జరిగే చర్చలో పాల్గొని సలహాలు, సూచనలు ఇవ్వాలని స్పీకర్​సూచించారు. బీఆర్ఎస్ మాట్లాడకపోవడంతో బీజేపీ సభ్యులకు అవకాశమిచ్చి మాట్లాడించారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని, వాళ్ల నినాదాల మధ్యలో తాను మాట్లాడలేకపోతున్నానని ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ కోరినా స్పీకర్ మాత్రం సస్పెండ్​చేయలేదు. దీంతో సభ నడిపిన తీరుపై స్పీకర్​కు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రతిపక్ష నేతలు కితాబిచ్చారు. ఏడాది కాలంలో ఒక్క ప్రతిపక్ష సభ్యుడిని కూడా సస్పెండ్ చేయకుండా సభ నడపడం ద్వారా ఆయన రికార్డు సృష్టించారని మంత్రి శ్రీధర్ బాబు కొనియాడడం విశేషం.