సీఎం అందరినీ కలుపుకొని వెళ్తున్నరు...ఇది ఫ్రెండ్లీ సర్కార్: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

  • గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి లేదని కామెంట్
  • నాంపల్లి లలితకళా తోరణంలో టీఎన్జీవో డైరీ ఆవిష్కరణ

హైదరాబాద్, వెలుగు : సమాజంలోని అన్ని వర్గాలను సీఎం రేవంత్ రెడ్డి కలుపుకొని వెళ్తున్నారని, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి లేదని గుర్తుచేశారు. సోమవారం ఆయన నాంపల్లి లలితకళా తోరణంలో టీఎన్జీవో కేంద్ర సంఘం న్యూ ఇయర్ డైరీ, క్యాలెండర్ ను ఎమ్మెల్సీ కోదండరాం, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ, పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.." ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా అమలు చేసేది ఉద్యోగులే.ఏడాది నుంచి పరిపాలన ఎంతో సవ్యంగా జరుగుతుందంటే అందుకు కారణం ఉద్యోగులే. వారి సమస్యలన్నింటిని ప్రభుత్వం పరిష్కరిస్తుంది.

ఆర్థిక పరిస్థితి ఆశించిన మేరకు లేకపోవటంతో సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు 42 రోజుల పాటు పెన్ డౌన్ చేయటం మరువలేనిది" అని వివరించారు. తాగుబోతు తండ్రి ఉంటే కుటుంబం ఎలా చెడిపోతుందో గత పదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అలా  తయారైందన్నారు. మన్మోహన్ సింగ్ కి సంతాపం తెలియజేయడానికి కేసీఆర్ ను స్వయంగా ఆహ్వానించినా ఆయన రాలేదని గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన దుబారా అప్పుల వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని ఎమ్మెల్సీ కోదండరాం ఆరోపించారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను వారధిగా ఉండి సీఎంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. నిధుల కొరత , రుణమాఫీ అమలుతో ఉద్యోగుల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ అన్నారు. ఉద్యోగులను ప్రభుత్వం చిన్న చూపు చూడటం లేదని చెప్పారు.  టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీభ్ లు మాట్లాడుతూ.. టీఎన్జీవో సంఘం గత ఏడు దశాబ్దాలుగా నిజాయితీగా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయడంలో నిబద్ధతతో ముందుంటుందని తెలిపారు. పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, హెల్త్ కార్డ్స్, 317 జీవో, ఓపీఎస్ అమలు సమస్యలు పరిష్కరించాలని నేతలు కోరారు.