బీఏసీ మీటింగ్ గందరగోళం..బాయ్ కాట్ చేసినబీఆర్ఎస్, ఎంఐఎం

  • బిస్కట్ అండ్ చాయ్ మీటింగ్ అన్న హరీశ్​రావు
  • అజెండా చెప్పడం లేదని అక్బరుద్దీన్ వాకౌట్​
  • హరీశ్​ స్పీకర్​ను డిక్టేట్​ చేసేలా మాట్లాడారన్న శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) మీటింగ్ గందరగోళంగా జరిగింది. సోమవారం అసెంబ్లీ టీ బ్రేక్ తరువాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన ఆయన చాంబర్ లో సుమారు గంట పాటు ఈ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అటెండ్ అయ్యారు.

కాగా ఈ మీటింగ్ ను బీఆర్ఎస్, ఎంఐఎం బహిష్కరించాయి. బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ మీటింగ్ అని హరీశ్ రావు వ్యాఖ్యానించారని, ఆయన స్పీకర్ ను డిక్టేట్ చేసేలా మాట్లాడాలని మీటింగ్ అనంతరం శ్రీధర్ బాబు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు, అజెండా ఏంటో చెప్పడం లేదని అక్బరుద్దీన్ బీఏసీ నుంచి వాకౌట్ చేశారు. కాగా బీఆర్ఎస్ తీరుపై శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అనుగుణంగా స్పీకర్ ఉండాలనుకోవటం కరెక్ట్ కాదన్నారు. సభ ఎన్ని రోజులు అనేది మంగళవారం సభలో స్పీకర్ ప్రకటిస్తారన్నారు.

రాష్ట్రపతి పర్యటన, క్రిస్మస్ సెలవులు ఉన్న నేపథ్యంలో సభపై వచ్చే వారం నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా వారం పాటు సభ నిర్వహించే అవకాశాలు కనపడుతున్నాయి. గత పదేండ్లు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీఏసీలో ఏ పార్టీ ఎమ్మెల్యేలు వారి  అభిప్రాయాలు చెప్పేవారన్నారు. కాగా 30 రోజులు సభ నిర్వహించాలని తాము కోరినట్లు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మీడియాకు తెలిపారు.