పార్లమెంట్ ముందు బీజేపీ X కాంగ్రెస్.. ఎంపీల మధ్య తోపులాట.. పరిస్థితి ఉద్రిక్తం

  • ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలు
  • హాస్పిటల్ కు తరలించిన ఎన్డీయే సభ్యులు
  • రాహుల్ నెట్టేయడంతోనే కిందపడ్డరు: బీజేపీ
  • ఎన్డీయే ఎంపీలే మమ్మల్ని తోసేసిన్రు: కాంగ్రెస్

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఆవరణలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు చేపట్టిన పోటాపోటీ నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. అంబేద్కర్‌ను అవమానించింది కాంగ్రెస్సే అంటూ బీజేపీ ఎంపీలు, కాదు.. కాదు బీజేపీ నేతలే అవమానించారంటూ కాంగ్రెస్ ఎంపీలు.. పార్లమెంట్‌ లోని మకర్ ద్వార్ ముందు గురువారం నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఇరు పార్టీ నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముఖేశ్ రాజ్​పూత్ కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయ్యాలయి. వీరిని తోటి బీజేపీ ఎంపీలు రామ్​మనోహర్ లోహియా హాస్పిటల్​కు తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నెట్టేయడంతోనే తమ ఎంపీలకు గాయాలయ్యాయని బీజేపీ సభ్యులు ఫైర్ అయ్యారు. కాగా, తాము పార్లమెంట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే.. బీజేపీ ఎంపీలే అడ్డుకున్నారని కాంగ్రెస్ సభ్యులు తెలిపారు. అధికారపక్ష ఎంపీలే మల్లికార్జున ఖర్గే, రాహుల్​ను తోసేశారని మండిపడ్డారు. ఖర్గే కిందపడిపోవడంతో ఆయన మోకాళ్లకు గాయాలయ్యాయని తెలిపారు. పార్లమెంట్ ఆవరణలోని కెమెరాలను పరిశీలిస్తే అసలేం జరిగిందో తెలుస్తదని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తూ బీజేపీ ఎంపీలు లోక్​సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఇక కాంగ్రెస్ ఎంపీలంతా.. బీజేపీ సభ్యుల వైఖరిని ఖండిస్తూ లోక్​సభ స్పీకర్​కు కంప్లైంట్ చేశారు. తాను కిందపడిపోవడంతో మోకాళ్లకు గాయాలయ్యాంటూ ఫిర్యాదులో ఖర్గే పేర్కొన్నారు. కాగా, పార్లమెంట్ ఆవరణలో జరిగిన తోపులాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఈ మేరకు మోదీతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు భేటీ అయ్యారు. అసలేం జరిగిందో ఆయనకు వివరించారు. తర్వాత గాయపడిన ఎంపీలతో మోదీ ఫోన్​లో మాట్లాడారు. 

ఎంపీలకు మోదీ, రాజ్​నాథ్​ పరామర్శ
పార్లమెంట్​ఆవరణలో జరిగిన తోపులాటలో గాయపడ్డ ఎంపీలను ప్రధాని మోదీ పరామర్శించారు. ఎంపీలు ప్రతాప్​ సారంగి, ముకేశ్​ రాజ్​పుత్​కు ఫోన్​చేసి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాగా, రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఢిల్లీలోని ఆర్ఎంల్​ హాస్పిటల్​కు వెళ్లి, చికిత్స పొందుతున్న ఎంపీలను పరామర్శించారు. వారి హెల్త్​ కండిషన్​పై ఆరా తీశారు. ప్రతాప్​ సారంగికి తలపై రెండు కుట్లు పడ్డాయని, ముకేశ్​ రాజ్​పుత్​ తలకు గాయమైందని చెప్పారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నదని మీడియాకు వెల్లడించారు.  

గూండాల్లా ప్రవర్తించారు: బీజేపీ
అంబేద్కర్​ను కాంగ్రెస్ నేతలు అవమానించారంటూ తాము పార్లమెంట్ లోని మకర్ ద్వార్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కాంగ్రెస్ ఎంపీలు దాడి చేశారని బీజేపీ ఆరోపించింది. రాహుల్ గాంధీ తమ ఎంపీలను నెట్టేశారని మండిపడింది. ప్రతిపక్ష ఎంపీలు గూండాల మాదిరి ప్రవర్తించారని ఫైర్ అయ్యింది. ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముఖేశ్ రాజ్​పూత్ గాయపడ్డారని తెలిపింది. సారంగి తలకు బలమైన గాయమైందని వివరించింది. కాంగ్రెస్ ఎంపీలే తమ వద్దకొచ్చి గొడవ పెట్టుకున్నారని తెలిపింది. ఈ సందర్భంగా సారంగి మాట్లాడారు. 

ALSO READ : సహజీవనం తప్పు.. సేమ్‌ సెక్స్‌ మ్యారేజ్లు సమాజానికి విరుద్ధం: కేంద్ర మంత్రి గడ్కరీ

‘‘నేను పార్లమెంట్‌ మెట్ల దగ్గర నిలబడ్డా.. ఆ టైమ్​లో రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టాడు. ఆ ఎంపీ వచ్చి నాపై పడ్డాడు. దీంతో నాకు గాయాలయ్యాయి’’అని తెలిపారు. ప్రతాప్ చంద్ర సారంగికి సపర్యలు చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ అక్కడికొచ్చారు. దీంతో బీజేపీ ఎంపీలు ఆయనపై ఫైర్ అయ్యారు. ఎంపీ నిశికాంత్ కాంత్ దూబే మాట్లాడుతూ..‘‘ఎంపీని తోసినందుకు సిగ్గుపడాలి. ఓ గూండా మాదిరి బిహేవ్ చేశావ్’’అని మండిపడగా.. రాహుల్ మాట్లాడుతూ.. ‘‘నేను ఎవరినీ తోయలేదు. సారంగినే నన్ను నెట్టేశారు’’అని చెప్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కొట్టేందుకే కుంగ్​ఫూ నేర్చుకున్నరా?: రిజిజు 
పార్లమెంట్​ ఆవరణలో జరిగిన తోపులాట విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​గాంధీపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు సెటైర్లు వేశారు. పార్లమెంట్​ మకర్​ ద్వార్​ వద్ద ప్రతిపక్షం ఆందోళనతో రోజును ప్రారంభించిందని అన్నారు. తోపులాటలో తమ ఎంపీలు ప్రతాప్​ సారంగి, ముకేశ్​ రాజ్​పుత్​ తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ‘‘ఇతర ఎంపీలను కొట్టేందుకే మీరు కరాటే, కుంగ్​ఫూ నేర్చుకున్నారా?” అని రాహుల్​గాంధీని ఉద్దేశించి వ్యంగాస్త్రాలు సంధించారు.

రాహుల్ నాపై అరిచారు: ఫంగ్నోన్ కొన్యాక్ 
పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ తనతో అనుచితంగా ప్రవర్తించారని బీజేపీ ఎంపీ ఫంగ్నోన్ కొన్యాక్ ఆరోపించారు. ‘‘మేం శాంతియుతంగా నిరసన తెలిపాం. నేను మకర ద్వారం మెట్ల దగ్గర నిల్చున్నాను. అప్పుడు రాహుల్ గాంధీ నాకు చాలా దగ్గరగా వచ్చారు. దాంతో నేను అసౌకర్యానికి గురయ్యాను. అంతేకాకుండా ఆయన నాపై అరిచారు” అని తెలిపారు. ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ తీరు సరికాదని, ఆయనపై రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు చేశానని చెప్పారు.

బీజేపీ ఎంపీలే  దాడి చేశారు: కాంగ్రెస్
పార్లమెంట్‌లోని మకర్ ద్వార్ వద్ద ఉన్న గోడ ఎక్కి ప్లకార్డులతో నిరసన తెలుపుతుంటే బీజేపీ ఎంపీలు వచ్చి నెట్టేశారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. తమ పార్టీ ఎంపీలను పార్లమెంట్ లోపలికి వెళ్లనివ్వలేదని మండిపడ్డారు. అంబేద్కర్​ను ఉద్దేశిస్తూ అమిత్ షా చేసిన కామెంట్ల వ్యవహారాన్ని పక్కదారిపట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే.. కావాలనే దాడి చేశారని మండిపడ్డారు. రాహుల్, ఖర్గేను తోసేశారన్నారు. ఖర్గే కిందపడిపోవడంతో మోకాళ్లకు గాయాలయ్యాయని తెలిపారు. బీజేపీకి దాడులు చేయడం కొత్త కాదని మండిపడ్డారు. అమిత్ షాకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.

నా మోకాళ్లకు గాయాలైనయ్: ఖర్గే
బీజేపీ ఎంపీలు తోసేయడంతో తాను కిందపడిపోయానని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తెలిపారు. ఈ మేరకు లోక్​సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. ‘‘శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే బీజేపీ ఎంపీలు నన్ను తోసేశారు. దీంతో నేను కిందపడిపోయాను. మోకాళ్లకు గాయాలయ్యాయి. సర్జరీ అయిన మోకాలికే దెబ్బ తగిలింది. బీజేపీ ఎంపీలపై చర్యలు తీసుకోండి’’ అని ఖర్గే ఫిర్యాదులో పేర్కొన్నారు.  

పక్కదారి పట్టించేందుకే బీజేపీ గొడవ: రాహుల్  
అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యల విషయాన్ని పక్కదారి పట్టించేందుకే పార్లమెంట్ ఆవరణలో తమతో బీజేపీనే గొడవకు దిగిందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తాము పార్లమెంట్ లోకి వెళ్తుంటే, బీజేపీ ఎంపీలే తమను అడ్డుకున్నారని చెప్పారు. ‘‘బీజేపీ రాజ్యాంగానికి, అంబేద్కర్ కు వ్యతిరేకం. అంబేద్కర్ పై  అమిత్ షా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఆయన క్షమాపణ చెప్పాలని, రాజీనామా చేయాలని మేం డిమాండ్ చేశాం. కానీ అది జరగలేదు. ఆ ఇష్యూను పక్కదారి పట్టించేందుకు బీజేపీ మాతో గొడవకు దిగింది.

మేమంతా పార్లమెంట్ లోకి వెళ్తుండగా, మెట్ల దగ్గర కట్టెలు పట్టుకుని బీజేపీ ఎంపీలు నిల్చున్నారు. మమ్మల్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు” అని రాహుల్ ఆరోపించారు. కాగా, అమిత్​ షాను కాపాడుకునేందుకే తన అన్న (రాహుల్​గాంధీ)పై బీజేపీ అసత్య ఆరోపణలతో కుట్ర చేస్తున్నదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ మండిపడ్డారు.  ‘‘నా కండ్లముందే ఖర్గేజీని తోసేశారు. ఆయన కిందపడిపోయారు. ఇదంతా వారి కుట్ర” అని ఆరోపించారు.