అటవీ శాఖలో ఇంటి దొంగలు! రూ.20 లక్షల టేకు దుంగల తరలింపులో చేతివాటం

  •  ఒక సామిల్ పేరుతో అనుమతి.. మరోచోట దిగుమతి 
  •  ఎఫ్ఆర్వో పర్మిషన్​ లేకుండానే కర్ర కట్టింగ్ 
  • విషయం తెలిసి ఎంక్వయిరీ చేసిన టాస్క్ ఫోర్స్ టీమ్​
  •  సామిల్ ఓనర్లతో కుమ్మక్కై తప్పును ఒప్పు చేసే ప్రయత్నాలు
  •  డీఆర్​వోను సస్పెండ్​ చేసిన ఉన్నతాధికారులు


ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా అటవీ శాఖలో ఇంటి దొంగల బాగోతం బయటపడింది. సామిల్​ ఓనర్లు చేసిన తప్పును కప్పి పుచ్చేందుకు, అక్రమ మార్గంలో వచ్చిన టేకును సక్రమంగా మార్చేందుకు చేసిన ప్రయత్నాలకు బ్రేక్​ పడింది. మామూళ్లు తీసుకొని, టేకు దుంగలకు పర్మిట్ ను కొత్తగా లాగిన్ చేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. విషయం బయటకు లీక్​ కావడంతో ఉన్నతాధికారుల వరకు మేటర్​ చేరింది. దీంతో ఏడేళ్లుగా ఖమ్మంలోనే పనిచేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న డీఆర్​వోను శనివారం సస్పెండ్​ చేశారు. తప్పు చేసిన రెండు సామిల్​లను సీజ్​ చేస్తున్నట్టు ఆఫీసర్లు ప్రకటించారు. తప్పును సరి చేసేందుకు కొత్త లాగిన్​ఎంట్రీ చేసిన ఎఫ్ఆర్వోపై కూడా యాక్షన్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

జరిగింది ఇదీ.. 

ఖమ్మంలోని శ్రీనివాస్ నగర్ లో ఉన్న మురళీకృష్ణ సామిల్ పేరుతో ట్రాన్సిట్ పర్మిట్ తీసుకొని నవంబర్​ 9న ఏపీలోని కొయ్యలగూడెం నుంచి 650 ఫీట్ల టేకు దుంగలను లారీలో తీసుకువచ్చారు. ఏపీలో పట్టాదారు నుంచి కొనుక్కొచ్చిన ఈ టేకు దుంగల విలువ ఫారెస్ట్ అధికారుల లెక్కల ప్రకారమే రూ.20 లక్షలు ఉండగా, మార్కెట్​లో అంతకు రెట్టింపు విలువ ఉంటుంది. 10న ఖమ్మం చేరుకున్న ఈ దుంగలను మురళీకృష్ణ సామిల్ లో కాకుండా, విజయ దుర్గా సామిల్ లో దించారు.

అటవీశాఖ అధికారుల అనుమతి తీసుకున్న చోట కాకుండా, కర్రను మరోచోట దిగుమతి చేయడం పెద్ద తప్పిదం. దిగుమతి చేసే ముందు అటవీశాఖ ఎఫ్ఆర్వో సామిల్ వద్దకు వచ్చి తనిఖీ చేసినట్లుగా ఫామ్ 6 రికార్డ్ లో సంతకం చేయాల్సి ఉంటుంది. ఇవేమీ అక్కడ పాటించకుండా, అటవీ శాఖ నుంచి పర్మిట్ లేకుండానే సామిల్ యజమాని కర్రను కట్ చేసి మరో తప్పు చేశారు. విషయం బయటకు పొక్కడంతో, అటవీశాఖ టాస్క్ ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేశారు. 

Also Read :- టూరిజం, ట్రావెల్స్ ప్యాకేజీపై..తిరుమల దర్శనాలు రద్దు

ఈ విచారణ రిపోర్ట్ రాకముందే, స్థానిక అటవీ అధికారులు రంగంలోకి దిగారు. సామిల్ అసోసియేషన్​ వాళ్లతో సెటిల్ మెంట్ కుదుర్చుకొని, అక్రమాలకు తెరలేపారు. ఎక్కడైతే టేకు కర్ర దిగిందో, ఆ సామిల్ కు ఎఫ్ఆర్వో లాగిన్ నుంచి ఆన్​లైన్ లో ట్రాన్సిట్ పర్మిట్ ను ఎంట్రీ చేశారు. పర్మిట్ అనుమతి కోసం పై అధికారులకు ఫార్వర్డ్ చేశారు. వ్యాపారుల తప్పును కప్పిపుచ్చేందుకు గాను ఈ వ్యవహారంలో రూ.5 లక్షల వరకు చేతులు మారినట్టు సహచర సామిల్ వాళ్లు చెబుతున్నారు. 

నెలవారీగా వసూళ్లు!

ఖమ్మంలో మొత్తం 50 వరకు సామిల్లులున్నాయి. వీటిలో ఒక అధికారి రెగ్యులర్​ గా తనిఖీల పేరుతో తిరుగుతూ, ప్రతినెలా ఒక్కో మిల్లు నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తాజా ఘటనలోనూ నవంబర్​ 10న టేకు కర్ర దొరికితే, 20 రోజుల పాటు నాన్చుతూ వచ్చారు.

 ఎంక్వైరీ రిపోర్ట్​ ను దాచి పెట్టి, లొసుగుల ఆధారంగా చేసుకొని మిల్లు యజమానిని సేవ్​ చేసే ప్రయత్నం చేశారు. డబ్బులు కూడా చేతులు మారినప్పటికీ, ఈలోగానే సామిల్లుల యజమానుల మధ్య సఖ్యత లేకపోవడంతో విషయం బయటపడింది. దీంతో రెండు సామిల్లులను సీజ్​ చేయగా, డీఆర్వో లక్ష్మీపతిని శనివారం సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 


డీఆర్వోను సస్పెండ్ చేశాం

ట్రాన్సిట్ పర్మిట్ లేకుండానే ఒక సామిల్లు నుంచి మరో సామిల్లుకు టేకు తరలించినట్టుగా విజిలెన్స్ అధికారుల​ నుంచి కంప్లైంట్ వచ్చింది. ఎఫ్​డీవో, ఖమ్మం టాస్క్​ ఫోర్స్ టీమ్​ ఆధ్వర్యంలో​ ఎంక్వైరీ చేశారు. ఆన్​లైన్​లో పర్మిట్ కోసం అప్లయ్​ చేశారు. 

కానీ పర్మిట్ ప్రాసెస్ కంప్లీట్ ​అవకుండానే ముందుగానే దుంగలను పంపించేశారు. ఎంక్వైరీ రిపోర్ట్ మేరకు డీఆర్వో ను సస్పెండ్ చేస్తూ వరంగల్ సర్కిల్ ఆఫీస్​ నుంచి ఆర్డర్స్​ వచ్చాయి. సామిల్లు యజమానులకు కూడా షోకాజ్​ నోటీసులిచ్చాం.-  సిద్ధార్థ్ విక్రమ్​ సింగ్, జిల్లా ఫారెస్ట్ అధికారి, ఖమ్మం