గంజాయి రవాణాదారులపై కఠిన చర్యలు : ఎస్పీ రూపేశ్

జహీరాబాద్, వెలుగు : గంజాయి అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీయాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ రూపేశ్ హెచ్చరించారు. శుక్రవారం  జహీరాబాద్ టౌన్ పీఎస్​లో మీడియాతో మాట్లాడారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టామన్నారు. తోపుడు బండ్ల వ్యాపారులు వాహనదారులకు ఇబ్బంది కలిగించొద్దన్నారు. నేరాల అదుపు కోసం పట్టణంలోని అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు.

జహీరాబాద్​లో ట్రాఫిక్ పీఎస్​కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. సిబ్బంది కొరత నివారించేందుకు కొత్తగా 24 మంది కానిస్టేబుళ్లను నియమించామన్నారు. నేరాల అదుపుకు పోలీసు అధికారులు, సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. ప్రెస్ మీట్ లో డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, సీఐలు శివలింగం, హనుమంతు, ఎస్ఐ కాశీనాథ్ పాల్గొన్నారు.

బాంబు డిస్పోజల్ టీం ఏర్పాటు

సంగారెడ్డి టౌన్: కొత్తగా నియామకమైన ఏఆర్ సిబ్బందితో బాంబ్ డిస్పోజల్ టీం ఏర్పాటు చేశామని ఎస్పీ రూపేశ్ తెలిపారు. శుక్రవారం టీంలో సభ్యులుగా చేరిన కొత్త కానిస్టేబుల్స్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వీఐపీల సమావేశాల సమయంలో బాంబు డిస్పోజల్ టీం ముందుగా వెళ్లి వారు వెళ్లే మార్గాన్ని, ప్రసంగించవలసిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే వారి కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు.

వీఐపీ వద్దకు వెళ్లే ప్రతి వ్యక్తిని ఏ విధంగా చెక్ చేయాలో కానిస్టేబుళ్లకు వివరించారు. వజ్ర వాహనాన్ని ఏ సమయంలో వినియోగించాలి, రబ్బర్ బులెట్లు, స్మోక్ గ్రానైట్స్ ఏ విధంగా ప్రయోగించాలనే అంశాన్ని స్వయంగా చేసి చూపించారు. కార్యక్రమంలో ఆర్ఐలు రామారావు, రాజశేఖర్ రెడ్డి , డానియల్, ఆర్ఎస్ఐ మురళీధర్, ట్రైనర్ నారాయణరావు, బాంబ్ డిస్పోజల్ టీం సిబ్బంది పాల్గొన్నారు.