సైబర్ క్రైమ్స్ అరికట్టేందుకు  చర్యలు : ఎస్పీ రావుల గిరిధర్ 

వనపర్తి టౌన్, వెలుగు : సైబర్ నేరాలను అరికట్టడం కోసం  చర్యలు చేపడుతున్నామని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్టేషన్ రైటర్లు, రిసెప్షన్, కోర్టుకానిస్టేబుల్స్​తో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, వారికి వెంటనే న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా సైబర్ క్రైం బాధితులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్ల లోనే ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. బాధితులు నేరుగా టోల్ ఫ్రీ నెంబర్ 155260 నెంబర్ కు ఫోన్ చేయొచ్చని చెప్పారు. ఓటీపీల పేరుతో, ఓఎల్ఎక్స్, ఫేస్ బుక్ నకిలీ ఐడీల రూపంలో, మొబైల్ ఫోన్లకు మెసేజ్ లు పంపి ఆ లింక్ క్లిక్ చేయడం, క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా తమ డబ్బులను పోగొట్టుకుంటున్నారన్నారు.

జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కోరారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ రాందాస్ తేజావత్, డీఎస్పీ, వెంకటేశ్వరావు, సైబర్ క్రైమ్ డీఎస్పీ, రత్నం, సీఐ లు కృష్ణ, రాంబాబు, శివకుమార్ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, నరేష్, డీసీఆర్బీ ఎస్సై, రవి ప్రకాష్, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.