కేసుల విచారణ పక్కాగా ఉండాలి :​ఎస్పీ డి జానకి

పాలమూరు, వెలుగు: ప్రతి కేసును పారదర్శకంగా విచారించి నిందితులకు శిక్ష పడేలా చూడాలని ఎస్పీ డి జానకి ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్  ఆఫీస్ లో సర్కిళ్ల వారీగా పోలీస్  అధికారులతో నేర సమీక్ష సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసులు నేరాలపై దృష్టి పెట్టాలని, నమోదైన ప్రతి కేసులో లోతుగా విచారణ చేపట్టాలని ఆదేశించారు. స్టేషన్ల వారీగా గ్రేవ్, నాన్  గ్రేవ్  కేసుల వివరాలను పరిశీలించి, ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసుల వివరాలను పరిశీలించి ఆ కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచేందుకు పోలీస్  అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 కంటెస్టెడ్  కేసులు కోర్టు ట్రయల్స్  నడిచే సమయంలో సాక్షులను బ్రీఫ్  చేస్తూ, ఎప్పటికప్పుడు కేసులకు సంబంధించిన విషయాలను బాధితులకు అప్​డేట్  చేయాలని సూచించారు. మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాలు, పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షల శాతాన్ని పెంచేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. దొంగతనం కేసులను ఛేదించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడిషనల్  ఎస్పీ రాములు, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, ఎస్బీ ఇన్స్​పెక్టర్  శివ కుమార్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.