రైతులకు అలర్ట్: సోయా పంటకు పల్లాకు తెగులు.. ఇలా రక్షించుకోండి

సోయాచిక్కుడు పంటలో పల్లాకు తెగులు జెమిని వైరస్‌ వల్ల కలుగుతుంది. ఈ వైరస్‌ సోయాచిక్కుడుతో  పాటుగా పెసర, అలసంద, పిల్లిపెసర, చిక్కుడు, మినుము  వంటి అనేక ఇతర పైర్లలో అలాగే పచ్చి మిరప, మురిపిండికా, పేరంట కూర వంటి కలుపు మొక్కల మీద కూడా ఆశిస్తుంది. ఈ వైరస్‌ తెల్లదోమ ద్వారా కలుపు మొక్కల నుండి పంట మొక్కలకు, పంటలో ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు, వ్యాప్తి చెందుతుంది. తెల్లదోమ పొలంలో ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతంగా వ్యాప్తి చెందుతుంది. తెల్లదోమ కొద్ది సంఖ్యలో ఉన్నప్పటికిని తెగులు వ్యాప్తి ఉదృతంగా జరిగే అవకాశం ఉంది. తెల్లదోమ ద్వారా తప్ప మరే ఇతర పద్ధతులలో ఈ తెగులు వ్యాప్తి చెందదు.

సోయాచిక్కుడు పల్లాకు తెగులు

సోయాచిక్కుడు కాయజాతి (లెగ్యూమ్),నూనెగింజల పంట. దీనిలో 43 శాతం మాంసకృత్తులు, 20 శాతం నూనె ఉంటుంది. పల్లాకు(ఎల్లో మొజాయిక్)తెగులు ఉధృతి  ఎక్కువగా ఉంది.ఈ తెగులు ముఖ్యంగా తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది.

లక్షణాలు

అకులు,కాయలమీద పసుపు పచ్చ పొడలు ఏర్పడి మొక్క పసుపు రంగులోకి మారుతుంది. తెల్లదోమ ద్వారా ఇది వ్యాపిస్తుంది.తెగులు సోకిన మొక్కలను మొదట్లోనే గుర్తించి వాటిని పీకి నాశనం చేయాలి.తెగులు సోకిన పొలం నుంచి విత్తనం సేకరించరాదు.

నివారణ

పసుపు రంగు జిగురు డబ్బాలు ఎకరానికి 10 అమర్చాలి. థయోమిథాక్సమ్ 40 నుంచి 50 గ్రా./200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. మొక్క తొలిదశలో వేపనూనె (1500 పి.పి.ఎం.) 5 మి.లీ./లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

పొగాకు లద్దెపురుగు

తల్లిపురుగులు ఆకుల అడుగు భాగాన చేరి పచ్చదనాన్ని గీకి తింటాయి.దీంతో ఆకులు జల్లెడలాగా మారుతాయి.ఆకులకు రంధ్రాలు చేసి,ఆకులను,పూలను,కాయలను తింటాయి.

నివారణ

లీటరు నీటికి 2.5 మి.లీ.క్లోరిపైరిఫాస్ లేదా 1.5 గ్రా.ఎసిఫెట్ చొప్పున కలిపి పిచికారి చేయాలి.