మూడు రోజుల ముందే.. ఏపీలోకి నైరుతి రుతుపవనాలు

  • మరో రెండు, మూడు రోజుల్లో తెలంగాణలోకి
  • నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు!
  • రాష్ట్రానికి ఎల్లో అలర్ట్​ జారీచేసిన వాతావరణ శాఖ
  • 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే చాన్స్

హైదరాబాద్, వెలుగు: నైరుతి రుతుపవనాలు మరింత తొందరగా ఏపీలోకి ప్రవేశించాయి. ఆదివారం రాయలసీమ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. దాంతోపాటు కర్నాటకలోని పలు ప్రాంతాల్లోనూ రుతుపవనాలు ఎంటరయ్యాయి. వాస్తవానికి ఈ నెల ఐదో తేదీ నాటికి రుతుపవనాలు ఏపీలో ప్రవేశించాల్సి ఉండగా.. మూడు రోజులు ముందుగానే వచ్చాయి.

వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. పరిస్థితులు ఇలాగే అనుకూలిస్తే మరో మూడు రోజుల్లో తెలంగాణలో కూడా రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దానికి ఆనుకుని కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో కొనసాగుతున్నదని ఐఎండీ పేర్కొంది. దాని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులపాటు తెలంగాణలోనూ వర్షాలు పడుతాయని తెలిపింది.

ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో రెండు రోజుల పాటు దంచికొట్టిన ఎండలు.. ఆదివారం కొంచెం తగ్గుముఖం పట్టాయి. రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. కోల్​బెల్ట్​లో మొన్నటి దాకా రికార్డు  ​ టెంపరేచర్లు నమోదుకాగా.. ఆదివారం ఆయా చోట్ల వర్షాలు పడుతుండడంతో అక్కడ ఉష్ణోగ్రతలు తగ్గాయి.

జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి మినహా మిగతా జిల్లాల్లో కూడా  టెంపరేచర్ల నుంచి ఉపశమనం కలిగింది. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్​ జిల్లాలో 44.4, పెద్దపల్లి, సిద్దిపేటలో 44.2, రాజన్న సిరిసిల్లలో 44.1, నిర్మల్​లో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 43 కన్నా తక్కువగానే టెంపరేచర్లు రికార్డయ్యాయి. అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

పలు జిల్లాల్లో వర్షాలు

ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్, వరంగల్, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, యాదాద్రి భువనగిరి, మెదక్​  జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

సిద్దిపేట జిల్లా కట్కూర్​లో 7.6 సెంటీమీటర్లు, హనుమకొండ జిల్లా మడికొండలో 7.4, కొండపర్తిలో 6.4, కరీంనగర్​ జిల్లా తడికల్​లో 6.3, హనుమకొండ జిల్లా దామెరలో 6.2, సిద్దిపేట జిల్లా నంగునూరులో 5.9, రంగారెడ్డి జిల్లా అర్కపల్లిలో 5.9, సిద్దిపేట జిల్లా సముద్రాలలో 5.8, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా లింగాపూర్​లో 5.6, వరంగల్​ జిల్లా కాపులకకనపర్తిలో 5, నల్లబెల్లిలో 4.8, వికారాబాద్​ జిల్లా బంట్వారంలో 4.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.