స్వదేశంలో 12 ఏళ్ళ తర్వాత టెస్ట్ సిరీస్ ఓటమి.. 24 ఏళ్ళ తర్వాత సొంతగడ్డపై వైట్ వాష్..న్యూజిలాండ్ తో 0-3 తేడాతో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత ఇది భారత్ పరిస్థితి. ఈ అనూహ్య ఓటములు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. 3-0 తేడాతో టెస్ట్ సిరీస్ చేజార్చుకున్న టీమిండియా.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (WTC 2023-25) పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ రాంకింగ్స్‌లో 62.50 పాయింట్లతో ఆస్ట్రేలియా టాప్‌లో కొనసాగుతుండగా.. 58.33 పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది.
న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ముందు వరకు టాప్ లో ఉన్నాం.. తిరుగులేదు అనుకుంటే ఇప్పుడు ఫైనల్ కు అర్హత సాధించాలంటే రెండో స్థానం కూడా అనుమానంగా మారింది. భారత్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ పోరుకు అర్హత సాధించాలంటే టాప్ 2 లో నిలవాలి. ఈ విషయంలో భారత్ కంటే ఆస్ట్రేలియా ముందుంది. కంగారూలు వారి సొంతగడ్డపై 5 టెస్టుల సిరీస్ ఆడనున్నారు. పటిష్టమైన ఆస్ట్రేలియా ఈ సిరీస్ గెలవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఆసీస్ తో పోలిస్తే ప్రస్తుత భారత్ జట్టు బలహీనంగా కనిపిస్తుంది.
మరోవైపు ఆస్ట్రేలియా కంటే సౌతాఫ్రికా ఈ రేస్ ముందుంది.55.56 పాయింట్లతో శ్రీలంక మూడు, 54.55 పాయింట్లతో న్యూజిలాండ్ నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. దక్షిణాఫ్రికా 54.17 పాయింట్లతో ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతుంది. సఫారీలు డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు మరో నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. వీటిలో రెండు శ్రీలంకపై.. మరో రెండు పాకిస్థాన్ పై ఆడనుంది. ఈ నాలుగు టెస్ట్ మ్యాచ్ లు కూడా సౌతాఫ్రికా వారి సొంత గడ్డపై ఆడనుంది.
ఆసియా దేశాలైన శ్రీలంక, పాకిస్థాన్ సఫారీలను ఓడించడం శక్తికి మించిన పని. అంచానాలకు తగ్గట్టు ఆడి.. సఫారీలు ఈ నాలుగు టెస్ట్ లు గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా నేరుగా ఫైనల్ కు చేరవచ్చు. భారత్, ఆస్ట్రేలియా 5 టెస్టులు ఆడనుండడంతో ఏ జట్టు గెలిచినా సౌతాఫ్రికాకు అనుకూలంగా మారుతుంది. శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు అన్ని మ్యాచ్ ల్లో గెలిస్తేనే ఫైనల్ అవకాశాలు ఉంటాయి. అన్ని సమీకరణాలు పరిశీలిస్తే ఈ సారి ఆస్ట్రేలియాతో సౌతాఫ్రికా టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.