IND vs SA 2nd T20: పోరాడి ఓడిన భారత్.. సౌతాఫ్రికాదే రెండో టీ20

సౌతాఫ్రికాతో ముగిసిన రెండో టీ20లో భారత్ అద్భుత పోరాటం చూపించింది. స్వల్ప లక్ష్యం అయినప్పటికీ సౌతాఫ్రికాను భయపెట్టింది. బౌలర్లు రాణించినా.. బ్యాటర్లు విఫలం కావడంతో రెండో టీ20లో సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ విధించిన 125 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఛేజ్ చేసింది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టి ఆశలు రేపినా.. విజయం సఫారీలనే వరించింది. దీంతో 4 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇరు జట్లు 1-1 తో సమంగా నిలిచాయి. ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం (నవంబర్ 13) జరుగుతుంది. 

స్వల్ప లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా తడబడింది. తొలి వికెట్ కు 22 పరుగులు జోడించిన తర్వాత అర్షదీప్ బౌలింగ్ లో రికెల్ టన్ (13) ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి చెలరేగడంతో హెన్డ్రిక్స్(24), మార్కరం (3) కూడా స్వల్ప వ్యవధిలో ఔట్ అయ్యారు. దీంతో ఆతిధ్య జట్టు 44 పరుగులకే 3 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఇదే ఊపులో జాన్సెన్(7), మిల్లర్(0), క్లాసన్(2) లను ఔట్ చేయడంతో 66 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో స్టబ్స్(47), కొయెట్జీ(19) కలిసి సఫారీలకు విజయాన్ని అందించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టాడు. అర్షదీప్ సింగ్, బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.   

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి  124 పరుగులు మాత్రమే చేయగలిగింది. 39 పరుగులు చేసిన హార్దిక్ పాండ్య టాప్ స్కోరర్ గా నిలిచాడు.  రింకూ సింగ్ (9),సంజు శాంసన్ (0) అభిషేక్ శర్మ (4), సూర్య కుమార్ యాదవ్ (4) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సెన్, కొయెట్జ్, పీటర్, మార్కరం, ఆండిలే సిమెలన్ తలో వికెట్ పడగొట్టారు.