IND vs SA 3rd T20I: సౌతాఫ్రికాతో మూడో టీ20.. టీమిండియా తుది జట్టులో RCB బౌలర్‌

సెంచూరియన్‌‌ వేదికగా సౌతాఫ్రికాతో నేడు (నవంబర్ 13) భారత్ మూడో టీ20లో తలబడుతుంది. సూపర్‌‌‌‌స్పోర్ట్‌‌ పార్క్‌‌ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. సిరీస్ లో తొలి టీ20 లో భారత్ గెలవగా.. రెండో టీ20లో పుంజుకొని సఫారీలు విజయం సాధించారు. ప్రస్తుతం నాలుగు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇరు జట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ కోల్పోయేందుకు ఛాన్స్ ఉండదు. దీంతో కీలకమైన ఈ మ్యాచ్ గెలిచేందుకు ఇరు జట్లు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. 

తుది జట్టు నుంచి అవేశ్ ఖాన్ ఔట్:

ఈ మ్యాచ్ లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ఫాస్ట్ బౌలర్ ఆవేశ్ ఖాన్ స్థానంలో యష్ దయాల్ కు చోటు దక్కనుంది. గత మ్యాచ్ లో భారత్ డెత్ ఓవర్లలో తడబడింది. స్లో బాల్స్ తో బోల్తా కొట్టించే దయాల్ కు ప్లేయింగ్ 11 లో చోటు ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్టు సమాచారం. ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున ఈ లెఫ్టర్మ్ ఫాస్ట్ బౌలర్ అద్భుతంగా రాణించాడు. దీంతో అతన్ని రూ. 5 కోట్లు పెట్టి బెంగళూరు రిటైన్ చేసుకుంది. ఈ ఒక్క మార్పు మినహాయిస్తే జట్టులో మార్పులు ఏమీ ఉండకపోవచ్చు. 

భయపెడుతున్న పిచ్: 

ఈ మ్యాచ్‌‌కు వేదిక కానున్న సూపర్‌‌‌‌స్పోర్ట్‌‌ పార్క్‌‌ పరిస్థితులపై అంతగా అవగాహన లేనందున సూర్యకుమార్ అండ్‌‌ కో జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. 2009 నుంచి ఈ వేదికపై ఇండియా ఒకే ఒక్క టీ20 మ్యాచ్‌‌ ఆడింది. 2018లో జరిగిన ఆ పోరులో ఆరు వికెట్ల తేడాతో ఓడింది. నాటి మ్యాచ్‌లో ఆడిన వారిలో హార్దిక్ పాండ్యా ఒక్కడే ప్రస్తుత టీమ్‌‌లో ఉన్నాడు.  రెండో మ్యాచ్ మాదిరిగా ఇక్కడి ఈ వికెట్‌‌పై మంచి పేస్‌‌, బౌన్స్ లభించనుంది. 

భారత తుది జట్టు (అంచనా): 

అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, వరుణ్ చక్రవర్తి,

సౌతాఫ్రికా తుది జట్టు (అంచనా):

రీజా హెండ్రిక్స్, ర్యాన్ రికెల్టన్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, గెరాల్డ్ కోయెట్జీ, ఆండిలే సిమెలన్, లూథో సిపమ్లా