WTC 2025: టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా.. మ్యాచ్ ఎప్పుడంటే..?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లే జట్లపై సస్పెన్స్ వీడింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు అధికారికంగా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకున్నాయి. బాక్సింగ్ డే టెస్టులో పాకిస్థాన్ పై గెలవడం ద్వారా సౌతాఫ్రికా ఫైనల్ కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఆదివారం (జనవరి 5) భారత్ పై సిడ్నీ టెస్టులో గెలిచిన ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. సౌతాఫ్రికా మరో టెస్ట్.. ఆస్ట్రేలియా మరో రెండు టెస్ట్ మ్యాచ్ లుక్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేకుండా రెండు జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి.      

మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడంటే..?
               
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ వేదిక ఇప్పటికే ఖరారైంది. ఈ మెగా ఫైనల్ మ్యాచ్ కు తొలిసారి లార్డ్స్ వేదిక కానుంది. ఈ  ఏడాది (2025) జూన్ 11 నుంచి 15 మధ్య ఐకానిక్ లార్డ్స్‌లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతుందని ఐసీసీ 2024 సెప్టెంబర్ 3 న ప్రకటించింది. జూన్ 16ని రిజర్వ్ డేగా కేటాయించారు. వరుసగా మూడోసారి ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఇంగ్లాండ్ లోనే జరగబోతుంది. 

Also Read :- స్మిత్ బ్యాడ్ లక్.. 9999 పరుగుల వద్ద ఆసీస్ స్టార్‌కు నిరాశ

ఇప్పటివరకు జరిగిన రెండు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లు సౌతాంప్టన్ (2021), ఓవల్ (2023) వేదికలుగా జరిగాయి. 2021 లో జరిగిన ఫైనల్లో భారత్ పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2023  ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 229 పరుగుల భారీ తేడాతో భారత్ ను ఓడించింది. ఆస్ట్రేలియా వరుసగా రెండో సారి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించగా.. సౌతాఫ్రికాపై ఇదే తొలిసారి.