WTC final 2025: ఆస్ట్రేలియాను ఎలా ఓడించాలో మాకు బాగా తెలుసు..: దక్షిణాఫ్రికా పేసర్

పదేళ్ల తరువాత బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని గెచుకున్న ఆస్ట్రేలియా.. వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్‌ చేరిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇంగ్లాండ్‌లోని ఐకానిక్ లార్డ్స్ వేదికగా ఇరు జట్లు గద కోసం పోరాడనున్నాయి. ఈ క్రమంలో కమ్మిన్స్ సేనకు సఫారీ పేసర్ రబడా హెచ్చరికలు పంపాడు. ఆస్ట్రేలియాను ఎలా ఓడించాలో తమకు బాగా తెలుసని అన్నాడు.

"దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా.. ఇరు జట్ల మధ్య ఎప్పుడూ తీవ్రమైన పోటీ ఉంటుంది. మైదానంలో ఇరు జట్ల ప్లేయర్లు ఒకేలా కష్టపడతారు. మ్యాచ్‌పై పైచేయి సాధించాలన్న కసి ప్రతి సంధర్భంలోనూ కనిపిస్తుంది. వారిపై ఎలా ఒత్తిడి పెంచాలో మాకు తెలుసు.. వారిని ఎలా ఓడించాలో కూడా మాకు తెలుసు.." అని రబాడ అన్నాడు.

ALSO READ | తమిళనాడు వాసి కాదు కాబట్టే జట్టులో ఉన్నాడు.. లేదంటే అతని కెరీర్ ముగిసేది: బద్రీనాథ్‌

దక్షిణాఫ్రికా గత ఏడాదిలో తమ ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. స్వదేశంలోపాటు విదేశీ సిరీస్‌లను గెలుచుకుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరాలంటే తొలి టెస్టులో పాకిస్థాన్‌ను ఓడించాలి. కానీ, ఏకంగా వైట్ -వాష్ చేసి మన పొరుగు దేశపు జట్టు(పాకిస్థాన్)ను స్వదేశానికి పంపింది. అయితే, కంగారూలను ఓడించడం రబాడ అనుకున్నంత సులభం కాదు. WTC డిఫెండింగ్ ఛాంపియన్‌..  ఆసీస్. ఇంగ్లండ్ పిచ్‌లపై వారికున్నంత అవగాహన మరే పర్యాటక జట్టుకు ఉండదు. బ్యాక్-టు-బ్యాక్ టైటిల్స్ గెలిచిన మొదటి జట్టుగా అవతరించే అవకాశాన్ని కంగారూలు అంత ఈజీగా వదిలిపెట్టరు. 

రెండు జట్లలోనూ ప్రపంచ స్థాయి పేసర్లు ఉండడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగనుంది. దక్షిణాఫ్రికా బౌలింగ్ విభాగానికి కగిసో రబడా నాయకత్వం వహిస్తుండగా.. ఆసీస్ పేస్ విభాగానికి ఆ జట్టు సారథి పాట్ కమిన్స్ నేతృత్వం వహిస్తున్నాడు. 

అగ్రస్థానంలో సఫారీ జట్టు

ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(WTC) సైకిల్‌లో 69.44 శాతం విజయాలతో ప్రొటీస్ జట్టు టేబుల్-టాపర్‌గా కొనసాగుతుండగా.. 63.730 విజయాలతో ఆస్ట్రేలియా  రెండవ స్థానంలో ఉంది. ఇక బోర్డర్- గవాస్కర్ ట్రోఫీని  1-3తేడాతో చేజార్చుకున్న టీమిండియా 50 శాతం విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది.